Marburg Virus: రోజుకో కొత్త వైరస్ పుట్టుకొస్తూ మానవ మనుగడనే ప్రశ్నార్థంకగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా అంతంకాకముందే మంకీ పాక్స్ పేరుతో మరో వైరస్ ముంచుకొచ్చింది. ప్రపంచం ఈ భయంలో ఉండగానే ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ‘మార్ బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన ఇద్దరు పడ్డారు. ఇంతకీ ఈ వైరస్ ఏంటి.? అసలు ఎలా వ్యాపిస్తుంది? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
గతంలో మార్బర్గ్ మెమరేజిక్ ఫీవర్‌గా పిలిచే మార్ బర్గ్ వైరస్ డిజీస్ (MVD) ప్రాణాంతకమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ మనుషుల్లో తీవ్ర జ్వరాన్ని కలిగిస్తుంది. ఈ వైరస్ తొలిసారి 1967లో వెలుగులోకి వచ్చింది. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలోని దక్షిణ అశాంటి రీజియన్ లో ఇద్దరు వ్యక్తులకు ‘మార్ బర్గ్’ వైరస్ సోకినట్టుగా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్ లో పెట్టినట్టుగా తెలిపింది. గబ్బిలాలు, అడవి జంతువులకు దూరంగా ఉండాలని.. మాంసం ఉత్పత్తులను బాగా శుభ్రం చేసి, ఉడికించిన తర్వాతే తీసుకోవాలని ఘనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ వైరస్ బారిన పడి వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారు పూర్తిగా నీరసంగా మారిపోతారు. మార్ బర్గ్ వైరస్ డిజీస్ ఎబోలా కుటుంబానికి చెందినది. గబ్బిలాలు నివసించే గుహల వద్ద ఎక్కువ కాలం గడిపే వారికి ఈ వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుంది.
మార్ బర్గ్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం చాలా కష్టం. మలేరియా, టైఫాయిడ్ జ్వరం మెనింజైటిస్ వంటి వైరల్ జ్వరాల నుంచి మార్ బర్గ్‌ను వేరు చేయడం చాలా కష్టం. అయితే కొన్ని రకాల పరీక్షల ద్వారా దీనిని గుర్తించవచ్చు. అవేంటంటే.. యాంటీబాడీ క్యాప్చర్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే, యాంటిజెన్ క్యాప్చర్ డిటెక్షన్, సీరం న్యూట్రలైజేషన్, రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, సెల్ కల్చర్ ద్వారా తెలుసుకోవచ్చు.
మార్ బర్గ్ వైరస్ సోకడం వల్ల వచ్చే వ్యాధి ప్రాణాంతకమని.. ఇది సోకినవారిలో 88 శాతం వరకు మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది.
గుహలు, భూగర్భ గనుల్లో నివాసమున్న గబ్బిలాలకు దూరంగా ఉండాలి. చేతులు, ముహానికి మాస్కులు ధరించాలి. మాంసహార పదార్థాలను తినేముందు బాగా ఉడికించాలి. ఈ వైరస్ సోకిన వారితో శారీరక సంబంధాలను నివారించాలి. లైంగిక సంక్రమణ ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ నుంచి కోలుకున్న 12 నెలలపాటు సురక్షితమైన లైంగిక విధానాన్ని అవలంభించాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..