రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
ప్రస్తుతం మారిన జీవన విధానంలో చాలా మంది పని ఒత్తిడిలో ఉండడం వల్ల భోజనానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం చాలా మందిలో సాధారణంగా మారింది. అయితే ఇది శరీరానికి అనేక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం జీర్ణక్రియపై, నిద్రపై, ఒత్తిడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

Late Night Meals
వైద్య నిపుణుల సూచనల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో భోజనం చేయడం ఉత్తమం. ఈ సమయానికి భోజనం చేస్తే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. పైగా హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత కనీసం 2 నుండి 3 గంటల విరామం ఇచ్చి నిద్రపోతే శరీరానికి మేలు జరుగుతుంది.
భోజనం ఆలస్యంగా చేస్తే
- జీర్ణక్రియ సమస్యలు.. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపునొప్పి సమస్యలు రావచ్చు.
- బరువు పెరిగే ప్రమాదం.. ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేయలేకపోతుంది. దీంతో కొవ్వు పేరుకుని బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి.
- నిద్రలేమి.. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే జీర్ణక్రియ సరిగా జరగదు. దీని వల్ల నిద్రలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.
- హార్మోన్ల అసమతుల్యత.. ఆలస్యంగా భోజనం చేయడం శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
- గుండె ఆరోగ్యంపై ప్రభావం.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టైమ్ కి భోజనం చేస్తే
- జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
- నిద్రలో అంతరాయం లేకుండా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది.
- బరువు నియంత్రణలో ఉంటుంది.
- గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందువల్ల భోజనాన్ని సకాలంలో తీసుకోవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించి సమయానికి భోజనం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.