మీ అరచేతులు దురద పెడుతున్నాయా..? డబ్బులొస్తాయని సంబరపడకండి..!
మన పురాతన నమ్మకాల ప్రకారం అరచేతిలో దురద వస్తే డబ్బులు రాబోతున్నాయన్న ఒక విశ్వాసం ఉంది. చిన్నప్పటి నుంచే చాలా మంది ఈ మాటను తరచుగా వింటుంటారు. ముఖ్యంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అరచేతిలో ఉన్న కొన్ని భాగాలలో దురద వస్తే అది ధన ప్రాప్తికి సంకేతమంటారు. కానీ ఇది ఎంతవరకు నిజమో అని పరిశీలిస్తే.. శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా ఒక సామాజిక నమ్మకమే తప్ప వాస్తవం కాదు. నిజానికి ఈ దురదకు వెనక ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరచేతులపై చర్మం సహజంగా తక్కువ నూనె గ్రంథులతో ఉంటుంది. శీతాకాలం లాంటి సీజన్లలో లేదా తరచూ చేతులు కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారడం జరుగుతుంది. చర్మం తేమ కోల్పోయినప్పుడు పొడిబారడం, చర్మం అసౌకర్యంగా అనిపించడం, దురద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజమే. ఇది ఏదైనా క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించి సులభంగా తగ్గించవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఇది ఎక్కువ అవుతుంది.
మరో వైపు అరచేతుల్లో దురదకు కారణం డయాబెటిస్ కావచ్చు. మధుమేహం ఉన్నవారిలో అధిక రక్తంలో చక్కెర స్థాయి కారణంగా నరాలు సరిగా పని చేయకపోవచ్చు. దీని వల్ల చేతుల్లో అసహజమైన అనుభూతులు.. ఉదాహరణకు తిమ్మిర్లు రావడం, చిరాకు అనిపించడం లేదా దురద వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటిని చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.. కానీ ఇవి డయాబెటిస్‌తో సంబంధమున్న ఒక శారీరక హెచ్చరికగా భావించాలి.
మరొక కారణం చర్మ అలెర్జీలు. మనం రోజూ ఉపయోగించే బాడీ వాష్‌లు, డిటర్జెంట్లు, చేతి సబ్బులు, సానిటైజర్లు వంటివాటిలో ఉండే కెమికల్స్ వల్ల చర్మం అలెర్జీకి గురవుతుంది. ఎవరైనా ఒక కొత్త ఉత్పత్తిని వాడిన తర్వాత తక్షణంగా దురద మొదలైతే అది అలెర్జీ లక్షణమే. కొన్ని మందులు కూడా చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సందర్భాల్లో వైద్యుల సలహా తప్పనిసరి.
ఇంకొన్ని సందర్భాల్లో లివర్ పనితీరు తగ్గితే కూడా దురద ఏర్పడే అవకాశం ఉంది. లివర్ శరీరంలోని పిత్త పదార్థాలను నియంత్రించే అవయవం. ఇది సరిగా పని చేయకపోతే చర్మం మీదా ప్రభావం చూపుతుంది. అరచేతులతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా ఇలాంటి దురద కనిపించవచ్చు. అలాగే మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని విషపదార్థాలు సమర్థవంతంగా బయటకు పోవు. ఫలితంగా అవి శరీరంలోనే చేరిపోయి చర్మంపై ప్రభావం చూపించి దురదగా మారవచ్చు.
థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా అరచేతుల్లో దురద వస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారికి చర్మం పొడిగా మారడం శరీరంలో తేమ తగ్గిపోవడం జరుగుతుంది. దీని ప్రభావం చేతుల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ జ్యోతిష్య సంబంధిత విషయాలతో కాకుండా.. ఆరోగ్య పరంగా పరిశీలించడం చాలా అవసరం. అరచేతిలో వచ్చిన చిన్న దురదను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే డర్మటాలజిస్టును సంప్రదించడమే ఉత్తమం.




