AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. అలాంటి వ్యక్తులు కూడా డయాబెటిస్ బారిన పడతారంట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

భారతదేశంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు.. ఈ క్రమంలో ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది.. స్థూలకాయులు మాత్రమే కాదు, సన్నగా ఉన్నవారు కూడా టైప్-2 మధుమేహ బాధితులుగా మారవచ్చని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఓర్నాయనో.. అలాంటి వ్యక్తులు కూడా డయాబెటిస్ బారిన పడతారంట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Diabetes Symptoms
Shaik Madar Saheb
|

Updated on: Dec 28, 2024 | 9:49 PM

Share

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. మధుమేహం గురించి చాలా విషయాలు వ్యాప్తి చెందుతుంటాయి.. ఈ వ్యాధి ఊబకాయం ఉన్నవారిలో మాత్రమే వస్తుందని చాలామంది నమ్ముతారు.. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ఈ భావన తప్పని రుజువు చేసింది. సన్నగా ఉన్నవారు కూడా టైప్-2 మధుమేహం, ఊబకాయం సంబంధిత వ్యాధుల బారిన పడతారని అధ్యయనంలో తేలింది. సాధారణ బరువు ఊబకాయం (Normal weight obesity), టైప్-2 మధుమేహం మధ్య సంబంధం ఆధారంగా పరిశోధనలో ఇది వెల్లడైంది.

సాధారణ బరువు ఊబకాయం (NWO) అంటే వ్యక్తి సాధారణ శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) కలిగి ఉంటాడు.. కానీ వారి శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తి BMI 18.5 నుంచి 24.9 మధ్య ఉంటుంది. అయినప్పటికీ, NWO ఉన్న వ్యక్తులు పురుషులకు 25%, స్త్రీలలో 32% కంటే ఎక్కువ శరీర కొవ్వును కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఊబకాయం వర్గంలో ఉంటుంది.

పరిశోధనలో ఏం తేలిందంటే..

ఈ అధ్యయనం అహ్మదాబాద్‌లోని ఎంపీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఇక్కడ టైప్-2 మధుమేహం ఉన్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 432 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో 33% మందిలో సాధారణ బరువు ఊబకాయం (NWO) లక్షణాలు కనిపించాయి. సాధారణ BMI ఉన్న 91% మంది పురుషులు, 51.8% మంది స్త్రీలు అధిక శరీర కొవ్వును కలిగి ఉన్నారు. NWO లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు అధిక కార్డియోమెటబోలిక్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. రాండమ్ బ్లడ్ గ్లూకోజ్ (RBS) స్థాయిలు, సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు, అధిక రక్తపోటు లక్షణాలు ఈ వ్యక్తులలో ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

తక్కువ బరువు ఉన్నవారిలో కూడా శరీర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పురుషుల సగటు BMI 23.9, మహిళల సగటు BMI 24.1.. శరీర కొవ్వు పురుషులలో 38.9%, స్త్రీలలో 34% ఉన్నట్లు కనుగొన్నారు. తక్కువ BMI ఉన్న పురుషులు కూడా 100% ఎక్కువ శరీర కొవ్వును కలిగి ఉంటారు. స్త్రీలలో 50% ఎక్కువ శరీర కొవ్వు ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..

సాంప్రదాయ స్థూలకాయం కాకుండా.. సాధారణ బరువు ఊబకాయం(Normal weight obesity).. ఆందోళన కలిగించే విషయమని మధుమేహ నిపుణులు పేర్కొంటున్నారు.. తరచుగా ప్రజలు తమ బరువు సాధారణమైనదనే భ్రమలో ఉంటారు. అందువల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ కారణంగా వారు తమ జీవనశైలి, ఆహారం పట్ల శ్రద్ధ చూపరు.

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏమి చేయాలంటే..

మీ శారీరక పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోండి.

శరీర కొవ్వు విశ్లేషణపై శ్రద్ధ వహించండి.. BMI ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోకండి.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఇందులో క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి..

మీ బ్లడ్ షుగర్ – బ్లడ్ ప్రెజర్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)