President Ram Nath Kovind: నిండు జీవితానికి రెండు చుక్కలు… పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి…
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 మొదటి దశ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులకు...
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 మొదటి దశ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా రాష్ట్రపతి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే, తదితరులు పాల్గొన్నారు. పోలియో టీకా కార్యక్రమాన్ని జనవరి 17న నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కానీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కారణంగా దీన్ని వాయిదా వేశారు. భారత్‌లో 2011లో చివరిగా గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలియో కేసులు నమోదయ్యాయి. 2014లో ప్రపంచారోగ్య సంస్థ భారత్‌ను పోలియోరహిత దేశంగా ప్రకటించింది.
జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి కేంద్రం పలు సూచనలు చేసింది. పోలియో చుక్కలు అందించే కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులతో పాటు వృద్దులు పోలియో కేంద్రాలకు రాకూడదని సూచించారు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి ఈ పోలియో చుక్కలు వేస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా…
తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38,31,907 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉండగా.. 23,331 కేంద్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.