దేశంలో చాందీపురా వైరస్, డెంగ్యూ వైరస్ రెండు కేసులు పెరుగుతున్నాయి. అయితే చాందీపురా వైరస్ ప్రమాదకరంగా మారింది. ఈ వైరస్ బారిన పడి అనేక మంది పిల్లలు మరణించారు. గుజరాత్‌లో చాందీపురా వైరస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్ అనేక ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. మరోవైపు డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే డెంగ్యూ వైరస్ మరణాల కేసులు నమోదు కానప్పటికీ.. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాందీపురా వైరస్, డెంగ్యూ వైరస్ వ్యాధి లక్షణాలు కొన్ని ఒకే విధంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ రెండు వైరస్ ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం.
చాందీపురా వైరస్ సోకితే తీవ్ర జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యవిభాగం డాక్టర్ సుభాష్ గిరి చెబుతున్నారు. చాందీపురా మెదడును ప్రభావితం చేస్తుంది. అయితే డెంగ్యూ బాధితుల్లో శ్వాస తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఏర్పడదు. డెంగ్యూ జ్వరం వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తుంది. అయితే చాందీపురా వైరస్ బాధితులు మాత్రం ఎక్కువగా పిల్లలలో ఉన్నారు.
చాందీపురా వైరస్ సోకిన ఈగ లేదా దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ పిల్లల శరీరంలోకి ప్రవేశించి ముందుగా ఊపిరితిత్తులపై దాడి చేసి మెదడులోకి వెళుతుంది. వైరస్ మెదడును ప్రభావితం చేస్తే.. అది మెదడువాపు వంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో రోగి ప్రాణాలను కాపాడడం వైద్యులకు సవాలే. చాందీపురా వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేదు. అంతేకాదు సరైన చికిత్స లేదు. కనుక రోగి లక్షణాల ఆధారంగా ఈ వైరస్ ను నియంత్రించడానికి విద్యులు చికిత్సనందిస్తారు.
డెంగ్యూతో బాధపడుతున్న చాలా మంది రోగులకు జ్వరం, కండరాల నొప్పి ఉంటుంది. డెంగ్యూ కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. తీవ్రమైన లక్షణాలను కలిగించదు. అయితే, కొన్ని సందర్భాల్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కు కారణమవుతుంది. అప్పుడు ప్రాణాంతకం కావచ్చు. డెంగ్యూ బాధితులలో ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి. 40 వేలలోపుకి ప్లేట్‌లెట్స్ చేరుకుంటే రోగి ప్రాణాలకు ప్రమాదం. డెంగ్యూ , చండీపుర వైరస్ ల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమిటంటే డెంగ్యూ కంటే చండీపుర వైరస్‌లో మరణాల రేటు ఎక్కువగా ఉంది. చండీపురలో మెనింజైటిస్ మరణానికి కారణం కావచ్చు. డెంగ్యూలో ఇటువంటి తీవ్రమైన లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..