మీరు ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగం చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
ప్రస్తుతం చాలా మందికి కూర్చుని చేసే ఉద్యోగాలు సర్వసాధారణమైపోయాయి. అయితే వీటి వల్ల శరీరం ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరం గతంలో కంటే నెమ్మదిగా స్పందిస్తుంది. అలాంటి సమయంలో చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

40 ఏళ్లు దాటాక వ్యాయామం చేయని జీవనశైలి వల్ల బరువు పెరగడం, వెన్నునొప్పి, కాళ్ల నొప్పి, మెడ పట్టేయడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కుర్చీలో కూర్చునే ఉద్యోగాలు మరింత సమస్యలను తెస్తాయి. అయితే అదే కుర్చీలోంచి చేసే చిన్న చిన్న స్ట్రెచ్‌లు, కదలికలు, వ్యాయామాలు శరీరానికి చురుకుదనం కలిగిస్తాయి.
వెన్న ఆరోగ్యం అంటే కేవలం నడవడానికే కాదు.. ఒత్తిడి తగ్గించడానికి కూడా ముఖ్యమే. కుర్చీలో నిటారుగా కూర్చుని, పాదాలను నేలపై గట్టిగా ఉంచాలి. రెండు చేతులను పైకి తల వైపు లేపి, శరీరాన్ని పైకి సాగదీయాలి. 10 సెకన్లపాటు ఆపి మళ్లీ మామూలు స్థితికి రావాలి. ఇది వెన్నునొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
చాలా సేపు కూర్చుంటే కాళ్లలో తిమ్మిరి, నొప్పి రావచ్చు. దీన్ని తగ్గించాలంటే కాఫ్ స్ట్రెచ్ చాలా ఉపయోగపడుతుంది. పాదాలను నేలపై గట్టి చేయాలి. తర్వాత మడమలను పైకి లేపాలి. వేళ్ల భాగం నేలపై ఉండాలి. 5 నుంచి 10 సెకన్ల పాటు ఆపి మళ్లీ నెమ్మదిగా పాదం నేలపైకి దించాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కాలును పైకి లేపే కూర్చున్న వ్యాయామం.. ఈ వ్యాయామం కింది శరీరానికి బలం ఇస్తుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని ఒక కాలును నేలకు సమాంతరంగా లేపాలి. 5 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. తర్వాత మళ్లీ మోకాలిని దించాలి. అదే విధంగా మరొక కాలుతో కూడా చేయాలి. ఇది మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెడ నొప్పి కూర్చునే ఉద్యోగాలు చేసేవారికి చాలా మామూలుగా వచ్చే సమస్య. దీన్ని తగ్గించడానికి మెడను తేలికగా రెండు వైపులా తిప్పడం.. పైకి, కిందికి వంచడం వంటివి ప్రతి గంటకోసారి చేయడం అవసరం. దీని వల్ల కండరాల ఒత్తిడి తగ్గి మెడ కదలిక మెరుగుపడుతుంది.
చాలా కాలం కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేయడం వల్ల చేతులు, భుజాలు పట్టేస్తాయి. చేతులను పక్కలకు నిటారుగా సాగదీయడం, భుజాలను గుండ్రంగా తిప్పడం వంటివి కొన్నిసార్లు చేస్తే కండరాల్లో ఉండే పట్టేసిన భావం తగ్గుతుంది.
శరీరం పట్ల కాస్త శ్రద్ధ తీసుకుంటే.. ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవచ్చు. కూర్చునే ఉద్యోగం చేయడం అంటే వ్యాయామానికి దూరంగా ఉండాలని కాకుండా.. కూర్చున్నప్పుడే వ్యాయామం చేయడం అనే ఆలోచనతో చూస్తే శరీరానికి అవసరమైన కదలికను ఇవ్వగలుగుతాం. 40 ఏళ్లు దాటిన వారు ఈ చిన్న మార్పులతో తమ జీవనశైలిని ఆరోగ్యపరంగా మార్చుకోవచ్చు.




