Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఒకప్పుడు జ్వరం వస్తే వాడే థర్మామీటర్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసే పల్స్ ఆక్సీమీటర్ గురించి కూడా చాలామందికి తెలిసిపోయింది. కరోనా సెకండ్‌వేవ్ ఎక్కువ మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ.. ముందు జాగ్రత్తగా ఆక్సీమీటర్లను దగ్గర ఉంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఆక్సీమీటర్ అంటే ఏమిటి..? ఆక్సీమీటర్ ఎలా పని చేస్తుందని.. దాని వల్ల ఉపయోగాలేంటో చూద్దాం.
మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లో ఫిల్టర్ అవుతుంది. ఆ తర్వాత ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తం సరఫరా అవుతుంది. హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ స్థాయిని ఆక్సీమీటర్లు ఎక్కిస్తాయి. పల్స్ ఆక్సీమీటర్ చిన్న క్లిప్ మాదిరిగా ఉంటుంది. దీనిని చేతి వేలికి గోరు భాగంలో పెట్టుకోగానే ఆక్సిజన్ లెవల్స్‌ను రీడింగ్ రూపంలో చూపిస్తుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వారిలో ఆక్సిజన్ లెవల్స్ 95 నుంచి 99 శాతం వరకు ఉంటాయి. అదే ఆక్సిజన్ 92 శాతం వరకు స్థిరంగా ఉంటే పర్వాలేదనుకోవచ్చు. కానీ అంతకు మించి తగ్గితే మాత్రం వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
ఆక్సీమీటర్ చేతి వేలికి పెట్టుకోగానే అది ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను రక్తకేశ నాళికల్లోకి పంపుతుంది. అప్పుడు ఇన్‌ఫ్రారెడ్ కిరణాల నుంచి వెలువడిన కాంతిని రక్తకణాలను గ్రహించడంలో వచ్చే మార్పు ఆధారంగా ఇది ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తుంది. ఆక్సీమీటర్ గుండె స్పందన రేటు కూడా చూపిస్తుంది. అయితే పల్స్ ఆక్సీమీటర్‌ను ఎక్కువగా చూపుడు వేలుకు పెట్టుకుంటారు. మధ్య వేలుకు పల్స్ ఆక్సీమీటర్‌ను పెట్టుకొని కూడా ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
► చేతి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే తొలగించాలి
► చేతులు చల్లగా ఉంటే వెచ్చదనం కోసం రెండు నిమిషాలు చేతులు రుద్దుకోవాలి
► పల్స్ ఆక్సీమీటర్ వాడే ముందు కనీసం ఐదు నిమిషాలు ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకోవాలి
► పల్స్ ఆక్సీమీటర్‌ను కనీసం నిమిషం పాటు చేతి వేలికి ఉంచాలి
► రీడింగ్ స్థిరంగా చూపించే వరకు అలాగే ఉంచాలి. కనీసం ఐదు సెకన్ల పాటు రీడింగ్‌లో ఎలాంటి మార్పు లేకపోతే దానిని అత్యధిక రికార్డుగా భావించాలి.
► ఆక్సిజన్ లెవల్స్‌ను ప్రతి రోజు ఒకే సయంలో మూడు సార్లు రికార్డు చేయాలి.
► ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించానా ఆక్సిజన్ లెవల్స్ 92 శాతం తక్కువగా ఉన్నా వైద్యున్ని సంప్రదించాలి.