రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
మన శరీర ఆరోగ్యాన్ని సూచించే ముఖ్యమైన అంశాలలో మూత్ర విసర్జన ఒకటి. మనం రోజులో ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తున్నామనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉండొచ్చు. అయితే అందరికీ ఒకే విధంగా ఉండదు. వయసు, జీవనశైలి, తాగునీటి పరిమాణం లాంటి అంశాలపై ఇది ఆధారపడుతుంది.

మన శరీరంలోకి వెళ్లిన నీరు, ఆహారం లాంటివి జీర్ణం అయిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు మూత్ర రూపంలో బయటకు వస్తాయి. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తర్వాత తయారైన మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. అది నిండినప్పుడు మెదడుకు సంకేతం వెళ్తుంది. అప్పుడు మనం మూత్ర విసర్జన చేస్తాం. ఇది ఒక సహజ ప్రక్రియ.
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజులో సగటున 6 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. అయితే రోజుకు 4 నుంచి 10 సార్లు మధ్యలో ఉన్నా అది కూడా సాధారణమే. కానీ రాత్రి సమయంలో ఒకసారికి మించి తరచుగా మూత్రానికి వెళ్లడం సాధారణం కాదు. ఇది శరీరంలో ఏదో మార్పు జరుగుతోందనే సంకేతం కావొచ్చు. తరచుగా మూత్రానికి వెళ్లడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- వయసు పెరగడం
- మూత్రాశయం చిన్నగా ఉండటం
- రోజులో ఎక్కువగా ద్రవాలు తీసుకోవడం
- మద్యం, కాఫీ లాంటి ఎక్కువ మూత్రం వచ్చే డ్రింక్ లు
- మధుమేహం లేదా మూత్ర మార్గ సంబంధిత ఇన్ఫెక్షన్లు (UTI)
- కొన్ని మందులు, సప్లిమెంట్ల ప్రభావం
ఈ కారణాల వల్ల కొంతమందికి తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. కానీ కొన్ని సార్లు ఇది దాగి ఉన్న ఆరోగ్య సమస్యల లక్షణం కూడా కావొచ్చు. మీరు రోజులో పదిసార్ల కంటే ఎక్కువ సార్లు లేదా నాలుగు సార్ల కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే అది ఒక హెచ్చరిక కావొచ్చు. అలాగే కింద ఇచ్చిన లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ ను కలవాలి.
- కారణం లేకుండా తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం
- ముదురు రంగులో కనిపించే మూత్రం
- మూత్రంలో రక్తం కనిపించడం
- మూత్ర విసర్జన సమయంలో లేదా తర్వాత తీవ్రమైన నొప్పి
- మూత్రం పూర్తిగా వెళ్లకపోవడం
- మూత్రం చిన్న చిన్న చుక్కలుగా రావడం
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి అసలు కారణాన్ని తెలుసుకొని చికిత్స తీసుకోవాలి. మీ శరీరానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను గమనించడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చు. మూత్ర విసర్జన అలవాట్లు కూడా అలాంటి వాటిలో ఒకటి. అలవాట్లు సాధారణంగా ఉన్నా బాగానే ఉంటుంది. కానీ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పటికప్పుడు శరీర సంకేతాలను గమనిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.




