Diabetes Diet: పొద్దుగాల ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!
డయాబెటిస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శరీరానికి కదలిక లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల డయాబెటిస్ బాధితులు రోజు రోజుకీ పెరుగుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగా పని చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీని వల్ల శరీరం చక్కెరను శక్తిగా మార్చడానికి బదులు దాన్ని రక్తంలోనే నిల్వ చేస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ కాలం పెరిగి ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, కంటి సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ప్రకృతిలో మనకు దొరికే కొన్ని మంచి పదార్థాలు డయాబెటిస్ ను సహజంగా నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి. అలాంటి వాటిలో మెంతులు ముఖ్యమైనవి. ఇవి వంటల్లో మనం మామూలుగా వాడేవే అయినప్పటికీ.. వాటి వైద్య గుణాలు చాలా శక్తివంతమైనవి.
ఆయుర్వేద నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. మెంతులు మధుమేహంపై బాగా పని చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గిస్తాయి. మెంతుల్లో ఉండే గెలాక్టోమన్నన్ అనే ఫైబర్ పదార్థం శరీరంలోని చక్కెర శోషణను తగ్గించి గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగితే గ్లూకోజ్ స్థాయిలపై అదుపు ఉంటుంది. దీని కోసం ఒక స్పూన్ మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగాలి. మరొక పద్ధతి.. మెంతుల్ని మరిగించి మెంతి టీగా తయారు చేసుకొని తాగవచ్చు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
మెంతులు డయాబెటిస్ ను మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆకలి నియంత్రణలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా మెంతుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలోని వాపులను కూడా తగ్గిస్తాయి.
డయాబెటిస్ ను నియంత్రించడానికి మందులతో పాటు.. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో మెంతులు మనకు సహజంగా దొరికే ఔషధంగా పని చేస్తాయి. రోజూ సరైన మోతాదులో మెంతులు తీసుకుంటే మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




