క్యాన్సర్ కణాలను విటమిన్లు కాపాడుతున్నాయా..? హెల్తీ అనుకున్నవే ముప్పుగా మారుతున్నాయా
మన శరీరంలో ప్రతి నిమిషం కోట్ల కణాలు పుడుతుంటాయి, అలాగే కొన్ని కణాలు మరణిస్తుంటాయి. ఇది ఒక సహజమైన ప్రక్రియ. పాడైపోయిన, హానికరమైన లేదా వయసు పైబడిన కణాలను శరీరం స్వయంగా నాశనం చేసుకునే ప్రక్రియనే ‘ఫెరోప్టోసిస్’ అంటారు. ఇది శరీరంలో వాపులు, వ్యాధులు వ్యాపించకుండా చూసే ఒక రక్షణ కవచం. అయితే, క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఈ సహజ మరణ ప్రక్రియ నుంచి తప్పించుకుంటున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విటమిన్ B12 ఎలా పాత్ర పోషిస్తుందో, దీనివల్ల మనం భయపడాలా లేదా అనే విషయాలను తెలుసుకుందాం..

విటమిన్ B12 కి సంబంధించిన కొన్ని జీవక్రియలు క్యాన్సర్ కణాలకు ఒక కవచంలా మారి, అవి చనిపోకుండా కాపాడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దీని గురించి విటమిన్ B12 ఉన్న ఆహార పదార్థాలను తినడానికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. విటమిన్ B12 అనేది మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి, కణాల మరమ్మత్తుకు మరియు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. గుడ్లు, పాలు, మాంసం, పప్పుధాన్యాలు, తృణధాన్యాల ద్వారా లభించే సహజమైన విటమిన్ B12 వల్ల ఎటువంటి క్యాన్సర్ ముప్పు ఉండదు. కాబట్టి వీటిని తినడం ఆపేయాల్సిన పనిలేదు.
నిపుణుల హెచ్చరిక..
క్యాన్సర్ నిపుణుల అసలు ఆందోళన సహజ ఆహారం గురించి కాదు, మార్కెట్లో దొరికే విటమిన్ టాబ్లెట్లు లేదా సప్లిమెంట్ల గురించి. చాలామంది డాక్టర్ సలహా లేకుండానే మల్టీవిటమిన్ లేదా విటమిన్-బి కాంప్లెక్స్ సప్లిమెంట్లను వాడేస్తుంటారు. దీర్ఘకాలం పాటు హై-డోస్‌లో విటమిన్-బి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ తీవ్రత పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇది క్యాన్సర్ చికిత్స పైన కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
భవిష్యత్తు చికిత్సకు..
ఈ పరిశోధన క్యాన్సర్ కణాల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. భవిష్యత్తులో ఈ అధ్యయనం ఆధారంగా సరికొత్త మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఆ మందులు క్యాన్సర్ కణాల రక్షణ వ్యవస్థను బలహీనపరిచి, అవి ఫెరోప్టోసిస్ ప్రక్రియ ద్వారా స్వయంగా నాశనమయ్యేలా చేస్తాయి. ప్రస్తుతానికి ఈ అధ్యయనం ప్రారంభ దశలోనే ఉంది, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విటమిన్ B12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. సహజ ఆహారం ద్వారా లభించే విటమిన్ B12 వల్ల ఎలాంటి నష్టం లేదు, కానీ వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు వాడకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
