చేతి గోళ్లు (Nails) అందాన్ని పెంచుతాయనడంలో అనిశయోక్తి లేదు. అమ్మాయిలు గోళ్లు పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇది కాస్త కష్టతరమైన పని. మనం అన్ని పనులను చేతులతో చేస్తాం. కాబట్టి వేళ్ల గోళ్లు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే అందమైన గోళ్లను మీ సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా గోళ్లు తేమను నిలుపుకోలేవు. అవి మృతకణాల సమ్మేళనం కాబట్టి అది నిర్జీవ పదార్థం. అందుకే కాస్త పొడుగు పెరగ్గానే విరిగిపోతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే గోరు వెచ్చని కొబ్బరి నూనెతో గోళ్లను మాసాజ్ చేయాలి. ఇలా చేస్తే గోళ్లు దృఢంగా, త్వరగా పెరుగుతాయి. గోళ్లు పెళుసుగా తయారైతే ఆలివ్ నూనె మంచి ఫలితాన్నిస్తుంది. ఇది గోళ్ల లోపలి పొరకు చేరి, దానికి తేమ అందిస్తుంది. అంతే కాకుండా గోళ్లల్లో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇలా క్రమంగా చేయడం వల్ల పెళుసుదనం తగ్గి మృదువుగా మారుతాయి.
విటమిన్ సి గోళ్ల పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ ముక్కను ఐదు నిమిషాలు గోళ్లపై రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గోర్లపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. తొందరగా పెరగాలనో, అందంగా ఉండాలనో రకరకాల టిప్స్ పాటిస్తుంటారు. షాపుల్లో దొరికే కండిషనర్స్ ను వాడటేస్తుంటారు. అంతే కాకుండా గోళ్లు అందంగా కనిపించేందుకు నెయిల్ ఆర్ట్, జెల్ వంటివి వాడేస్తుంటారు. ఇవి గోళ్ల ఎదుగుదలనూ నిరోధిస్తాయి.
గోర్లు ఆరోగ్యంగా పెరిగేందుకు బయోటిన్ ఉపయోగపడుతుంది. బయోటిన్ అధికంగా ఉండే అరటిపండ్లు, అవకాడోలను డైట్ లో భాగం చేసుకోవాలి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. బచ్చలికూరలో, అధిక స్థాయిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9 ఉంటాయి. ఇవి గోళ్ల పెరుగుదలకు సహకరిస్తాయి. వెల్లుల్లిలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. వెల్లుల్లి ముక్కతో మీ వేలుగోళ్లను రుద్దండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి