Telangana: టాటా ఏస్ వాహనంపై పడిన భారీ వృక్షం.. ఇద్దరు యువకులు మృతి.. విహారయాత్రకు వెళ్తుండగా ఘటన
నిర్మల్ (Nirmal) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలు తీశాయి. రోడ్డుపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంపై భారీ చెట్టు పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్..
నిర్మల్ (Nirmal) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలు తీశాయి. రోడ్డుపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంపై భారీ చెట్టు పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు.. కుంటాల (Kuntala Falls) జలపాతం చూసేందుకు బయల్దేరారు. ఖానాపురం మండలంలోని ఎగ్బాల్ పూర్ సమీపంలోనికి చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న వాహనంపై భారీ చెట్టు పడిపోయింది. ఈ ఘటనలో భుచ్చన్న, రవి అనే ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. నిఖిల్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిఖిల్ ను ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు.
కాగా.. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉదయం వాయుగుండంగా బలపడిందని వివరించారు. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్తూ బలహీనపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..