మనదేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. పప్పు నుంచి దమ్ బిర్యానీ వరకు ఎన్నో ప్రత్యేకతలు మన సొంతం. అయితే కొంత మంది శాకాహారం తినేందుకు ఇష్టపడితే.. మరికొందరు మాత్రం మాంసాహారాన్ని ఆహారంగా తీసుకుంటారు. మరికొందరు మాత్రం శాకాహారం, మాంసాహారం రెండింటినీ తమ డైట్ లో చేర్చుకుంటారు. ఏ రకమైన ఆహార పదార్థాన్ని తిన్నా.. అవి శరీరానికి పోషకాలు, విటమిన్లు అందిస్తాయి. అయితే కొన్ని పదార్థాల్లో ఉండే పోషకాలు ఇతర పదార్థాల్లో ఉండకపోవచ్చు. అలాంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోకపోవడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందవు. అందువల్ల అలాంటి ఆహారానికి దూరంగా ఉండేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. ముఖ్యంగా శాకాహారాన్ని తీసుకునే వారిలో ప్రొటీన్ లోపం అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాంసంలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. వారు మాంసం తినకపోవడం వల్ల వీటి ఆరోగ్య ప్రయోజనాలు వారికి అందవు. కాబట్టి వారు పప్పుధాన్యాలను విరివిగా ఉపయోగిస్తారు. పప్పులు శాకాహారులకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి ప్రోటీన్, ఖనిజాలు, ఫైబర్, పోషకాలతో నిండి ఉంటాయి. కానీ, కొన్ని పప్పులు తింటే పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
కందిపప్పు.. ఈ పప్పును సాధారణంగా ప్రతి ఇంట్లో చాలా ఎక్కువ సార్లు వండుకుంటారు. టమోటా, దోసకాయ, పాలకూర.. ఇలా వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తుంటారు. వీటిలో ఉండే పోషకాలు మిగతా పప్పు దినుసులతో పోలిస్తే అధికంగా ఉంటాయి. కానీ కందిపప్పును అధికంగా తింటే కడుపులో గ్యాస్‌కి కారణమవుతుంది. దీన్ని అధిగమించేందుకు ఈ పప్పుని చేసినప్పుడల్లా ఎర్ర కందిపప్పుని సమాన పరిమాణంలో కలపాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది సులభంగా జీర్ణమవుతుంది. అలాగే దీనిని వండేందుకు ఓ అర గంట నుంచి గంట వరకూ నానబెట్టాలి.
మినప్పప్పు.. సాధారణంగా మినప్పప్పులో తెల్లవి, నల్లవి అని రెండు రకాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా జరిగే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. కాళ్లు, పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పుని వండడానికి ముందు కనీసం 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. ఉల్లిపాయ తక్కువ వేసి వండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది.
తెల్ల బఠానీలు.. చాలా మంది వీటిని పులావ్, బిర్యానీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వండేటప్పుడు కొన్ని గంటల పాటు నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇది హెల్దీ పప్పుల్లో ఒకటి. ప్రోటీన్, ఫైబర్ లు వీటిలో అధికంగా ఉంటాయి. అయితే.. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రకమైన బీన్స్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించేందుకు వాటిని 12 గంటలు నానబెట్టి ఇంగువ వేసి ఉడికించాలి. అలా చేస్తే గ్యాస్ సమస్యలు రావు.
శనగపప్పు..వంటింటి పోపు డబ్బాలో ముఖ్యంగా ఉండే పప్పుల్లో శనగపప్పు ఒకటి. కానీ ఇది కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వండే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. దీంతో మంచి రుచి రావడమే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలూ తగ్గుతాయి. ఈ పప్పు వండేటప్పుడు ఇంగువ, ధనియాల పొడి, మెంతి పొడి కలపడం మంచిది. దీంతో అదనపుప్రయోజనాలు కూడా కలుగుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి