చిన్నప్పుడు చక్కెర తక్కువగా తింటే.. డయాబెటిస్ రాకుండా ఉంటుందా..? పరిశోధనలో షాకింగ్ నిజాలు..

మధుమేహం.. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి.. భారతదేశంలో డయాబెటిస్ వ్యాధి రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మధుమేహానికి సంబంధించి ఓ పరిశోధన జరిగింది. ఇందులో చిన్నతనంలో స్వీట్లు తినడానికి, మధుమేహానికి మధ్య సంబంధం గురించి వివరించారు.

చిన్నప్పుడు చక్కెర తక్కువగా తింటే.. డయాబెటిస్ రాకుండా ఉంటుందా..? పరిశోధనలో షాకింగ్ నిజాలు..
Diabetes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2024 | 5:53 AM

మధుమేహం అనేది నేటి కాలంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి.. ఇది వృద్ధులలోనే కాకుండా పిల్లలలో కూడా కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహ బాధితులుగా మారుతున్నారు. భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతోంది. తీపిని ఎక్కువగా తినడం వల్ల కూడా మధుమేహానికి కారణమవుతుందని సాధారణంగా నమ్ముతారు.. అయితే స్వీట్లు మధుమేహానికి ప్రమాద కారకంగా ఉండే ఊబకాయాన్ని పెంచుతాయి. ఇటీవల మధుమేహానికి సంబంధించి ఒక పరిశోధన జరిగింది.. అందులో చిన్నతనంలో స్వీట్లు (పంచదార) తక్కువగా తింటే వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని వివరించారు.

ఈ పరిశోధన గురించి తెలుసుకునే ముందు మధుమేహం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.. మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ హార్మోన్ ఉంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కానప్పుడు లేదా ఈ హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.. ఇది డయాబెటిస్‌కు కారణమవుతుంది.

మధుమేహం రెండు రకాలుగా విభజిస్తారు..

మొదటిది, టైప్ 1 డయాబెటిస్.. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది.

రెండవది, టైప్ 2 డయాబెటిస్.. ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం – చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య వస్తుంది. భారతదేశంలో టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి..

పరిశోధన ఏం చెబుతోంది?

ఇటీవల నేచురల్ జర్నల్‌లో ఒక పరిశోధనను ప్రచురించారు. బాల్యంలో తక్కువ చక్కెర తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ పరిశోధన నేరుగా మన శరీరం జీవక్రియ – ఇన్సులిన్ కు సంబంధించినది. బాల్యంలో చక్కెర తీసుకోవడం తగ్గించి, పిల్లలకు పౌష్టికాహారం ఇస్తే, జీవక్రియపై ఎక్కువ ఒత్తిడి ఉండదు.. శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుందని వివరించారు.

చిన్నతనం నుంచి చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇన్సులిన్ పనితీరు క్షీణించి, మధుమేహం సమస్య సంభవించవచ్చు. చిన్నతనంలో స్వీట్లు తక్కువగా తీసుకుంటే, యుక్తవయస్సులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

మధుమేహాన్ని ఎలా నివారించాలి..

  • రోజువారీ వ్యాయామం
  • మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం
  • చక్కెర – మిఠాయిలు ఎక్కువగా తినొద్దు
  • మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం..

మధుమేహం హెచ్చరిక సంకేతాలు..

తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, భారీగా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, అలసట, దృష్టిలోపం, పుండ్లు నయం కాకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, జలదరింపు లేదా తిమ్మిరి, చర్మంపై మచ్చలు లాంటివి కనిపిస్తాయి..

ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి