AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: యాడ దొరికిన సంతరా సామి.. డెంగీ వచ్చినవారిలో ఆ పార్ట్‌పై ఎఫెక్ట్

డెంగీ జ్వరాల సమయంలోనే కాదు.. తగ్గిన తర్వాత కూడా అపాయం పొంచి ఉంది. ప్లాస్మా లీకేజ్ కారణంగా గుండెపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. డెంగీ రోగుల్లో 12.5 శాతం మందికి గుండె ఫెయిల్యూర్ ముప్పు ఉన్నట్టు తేలింది.

Dengue: యాడ దొరికిన సంతరా సామి.. డెంగీ వచ్చినవారిలో ఆ పార్ట్‌పై ఎఫెక్ట్
Dengue
Ram Naramaneni
|

Updated on: Aug 03, 2025 | 10:06 PM

Share

డెంగీ నుంచి కోలుకుంటున్న దశలో ఉన్న రోగుల్లో గుండె సంబంధిత ప్రమాదాలు ఉన్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో 2023–2025 మధ్య 350 మంది డెంగీ బాధితులపై నిర్వహించిన పరిశోధనలో 44 మంది (12.5%) గుండె సంబంధిత సమస్యలతో ఎదుర్కొన్నట్టు తేలింది. డెంగీతో బాధపడే కొంతమందిలో ‘క్యాపిలరీ లీకేజ్‌ సిండ్రోమ్‌’ (CLS) అనే స్థితి ఎదురవుతోంది. ఇందులో రక్తంలోని ద్రవ భాగమైన ప్లాస్మా లీకై, రక్తం చిక్కబడటం వల్ల శరీర అవయవాలకు సరైన రక్త సరఫరా నిలిపిపోతోంది. దీంతో గుండె పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మయోకార్డిటిస్‌, అనారోగ్య హార్ట్ బీట్, గుండె పంపింగ్‌లో తగ్గుదల వంటి లక్షణాలు CLS ఉన్నవారిలో కనిపిస్తున్నాయి.

బయోమార్కర్లతో ముందస్తు హెచ్చరిక

హెమటోక్రిట్, ట్రొపొనిన్, ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, సీరమ్ ఆల్బ్యూమిన్, N-ProBNP వంటి పరీక్షలతో గుండె ఫెయిల్యూర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించడం వల్ల రోగి ప్రాణాలు రక్షించవచ్చని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. కడుపునొప్పి, కళ్లకింద నీరు, వాంతులు, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తే CLS గుర్తించే సూచనగా పరిగణించాలన్నారు.

పరిశుభ్రతే ప్రాథమిక ఔషధం

డెంగీ వ్యాధి ప్రధానంగా దోమల వల్ల వ్యాపిస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తాచెదారం వదిలిపెట్టడం వల్ల దోమల ఉద్భవం ఎక్కువవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, తలనొప్పి వంటి ప్రాథమిక లక్షణాలే కనిపించినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు విషయమేమిటంటే: డెంగీ తగ్గిపోతుందని ఊపిరి పీల్చకండి… అదే సమయంలో గుండెపై దెబ్బ పడే ప్రమాదం ఎక్కువ. CLS ఉన్నట్టు గుర్తించగలిగితే ముందస్తు జాగ్రత్తలతో ప్రాణాలు కాపాడొచ్చు.