పెద్దప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గించే.. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడానికి ఈ మార్చి నెలను కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. అయితే మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు.. శరీరంలోనే కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని నీటిని, పొటాషియం, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అంతేకాక శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీన్ని వైద్య భాషలో కోలన్ అంటారు. పెద్ద పేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్. ఈ వ్యాధితో ఏటా వేలాది మంది చనిపోతున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) అంచనా ప్రకారం కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు 2020 నుంచి 2040 మధ్యలో 56% పెరిగే అవకాశం ఉంది.
అలాగే సంవత్సరానికి 3 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని IARC స్పష్టం చేసింది. 2040లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.6 మిలియన్ల మంది మరణాలుకు ఈ క్యాన్సర్ కారణం అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కేసులు ఎక్కువగా మానవాభివృద్ధి సూచిక ఎక్కువగా ఉన్న దేశాలలో ఉంటుందని అంచనా. అందుకే ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని.. నివారించడం చాలా మేలు. మరి పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలేమిటో.. అది ఎవరికీ ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకంగా ఉంటుంది, మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటాయి. మలం వదులుగా అవుతూ ఉంటుంది. పొట్ట కింది నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పురీషనాళం నుంచి లేత ఎరుపు రక్తస్రావం, రక్తం కారణంగా మలం ముదురు రంగులో ఉంటాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం. బలహీనత, అలసట, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. తొలి దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే.. మహమ్మారిపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి