AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భనిరోధక మాత్రలు నిజంగా సేఫేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

మహిళలందరూ గర్భనిరోధక మాత్రలు వాడటం సౌకర్యంగా భావిస్తారు. ఇవి గర్భధారణను నియంత్రించడం కోసం ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న పద్ధతులు. అయితే ఇలాంటి మాత్రలు వాడినప్పుడు కొంతమందికి ప్రమాదాలు ఉండవచ్చని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మందులు కొన్ని రకాల గుండె సంబంధిత సమస్యలతోపాటు పక్షవాతం అనే తీవ్రమైన ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. గర్భనిరోధక మందుల వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భనిరోధక మాత్రలు నిజంగా సేఫేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Birth Control Pills
Prashanthi V
|

Updated on: Jun 09, 2025 | 11:01 PM

Share

ఈ మధ్యకాలంలో 18 నుంచి 49 ఏళ్ల మధ్య యువతుల్లో కనిపించే క్రిప్టోజెనిక్ స్ట్రోక్ (ఏ కారణం లేకుండా మెదడులో రక్త ప్రవాహం ఆగిపోవడం)పై పరిశోధనలు జరిగాయి. వీటిలో హార్మోన్ మాత్రలు వాడే మహిళల్లో ఈ ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గుర్తించారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్యపరమైన ప్రమాదకారక అంశాలు ఉన్నా కూడా స్ట్రోక్ వచ్చే అవకాశంలో గణనీయమైన తగ్గుదల కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

నిపుణుల వివరణ ప్రకారం.. హార్మోన్ మాత్రల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే పదార్థం రక్తం గడ్డ కట్టే ప్రభావాన్ని పెంచుతుందని తెలియజేశారు. సాధారణంగా రక్తంలో గడ్డకట్టే ప్రక్రియ సహజమే అయినప్పటికీ.. ఈస్ట్రోజెన్ ఎక్కువ మోతాదులో ఉంటే ఇది ప్రమాదకరం అవుతుంది. గడ్డ కట్టడం వల్ల మెదడుకు రక్తం సరఫరా తగ్గి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.

ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. పొగ తాగడం, అధిక బరువు, మైగ్రేన్ లాంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ప్రత్యేకించి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ కలిపిన హార్మోన్ మాత్రల్లో ఉండే కృత్రిమ ఈస్ట్రోజెన్ వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వజైనల్ రింగ్, ప్యాచ్ లాంటి ఇతర హార్మోన్ల పద్ధతుల వాడకం కూడా పక్షవాతం ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

అయితే ఇది చాలా అరుదైన ప్రమాదం మాత్రమే. 4,700 మందిలో ఒక్కరికి మాత్రమే ఇది సంభవించవచ్చు. కానీ ఈ మాత్రలు వాడే మహిళల సంఖ్య భారీగా ఉండటం వల్ల.. మొత్తం మీద ఈ ప్రమాదం అందరికీ పెద్ద సమస్యగా మారుతుంది.

అయితే ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గర్భనిరోధక మందులు వాడటం వల్ల కలిగే ప్రమాదాలతో పాటు, గర్భధారణ సమయంలో కూడా రక్తం గడ్డ కట్టే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. అందువల్ల తల్లి బిడ్డ ఆరోగ్య ప్రయోజనాలను అన్నింటినీ పరిగణించి జాగ్రత్తగా ఎంచుకోవడం అవసరం.

ఈ అంశంపై మరింత పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి సమాచారం కలిగి ఉండటం చాలా అవసరం.

ఈ మాత్రలు వాడటం వల్ల కొంతమేర రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు కావడం వల్ల వైద్యులతో మాట్లాడి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మందుల వాడకానికి ప్రత్యామ్నాయాలు ఉంటే అవి కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)