Buvine virus : దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ ప్రజలను ఆగమాగం చేస్తోంది. ఇటువంటి సమయంలో మరో కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రజలు మరోసారి అప్రమత్తంగా వ్యవహరించాలి. హర్యానాలోని హిసార్‌లో 1 నెల వయసున్న దూడలో బవిన్ అనే కొత్తరకం వైరస్ కనుగొన్నారు. లాలా లజ్‌పత్ రాయ్ వెటర్నరీ హాస్పిటల్ యానిమల్ బయోటెక్నాలజీ విభాగం ఈ బవిన్ కరోనా వైరస్‌ని కనుగొంది. వాస్తవానికి 250 దూడల నమూనాలను రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకొని పరిశోధనలు చేశారు. ఈ నమూనాలలో చాలా వాటిలో వైరస్‌కి సంబంధించి లక్షణాలు కనిపించాయి. ఇందులో ఐదింటిపై లోతుగా పరిశోధన చేయగా బవిన్ వైరస్ వెలుగులోకి వచ్చింది.
రాబోయే పదేళ్లలో మానవులకు వచ్చే వ్యాధులు జంతువుల నుంచే వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్త డాక్టర్ మీనాక్షి చెప్పారు. జంతువులలో అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. అవి మ్యుటేషన్ తర్వాత కొత్త రూపాన్ని తీసుకోవచ్చు. ఈ వైరస్ ఇప్పుడు ఏ జాతిలో వెళుతుందో తెలియదు కానీ అది ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుందని నిర్దారించారు.
పాలు, మాంసం ద్వారా మానవులకు వ్యాప్తి..
జంతువుల విసర్జన, పాలు, మాంసం ద్వారా బవిన్ వైరస్ మానవులకు చేరగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధన ప్రకారం ఈ వైరస్ మొదట ఒంటె నుంచి వచ్చింది. ఈ వైరస్ దిన దినం పరివర్తన చెందుతూనే ఉంటుంది. అనగా ఇది పెద్ద జంతువులలోకి, మానవులకు కూడా సోకవచ్చు.
మానవులకు బవిన్ వ్యాప్తి చెందే ప్రమాదం
ప్రమాదం ఏమిటంటే ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకితే చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. శాస్త్రవేత్తల ప్రకారం బవిన్ వైరస్ విరేచనాలకు కారణమవుతుంది. ఇది జంతువుల నుంచి జంతువులకు, మానవులకు వ్యాప్తి చేందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.