నడుము కింది భాగంలో నొప్పి వస్తోందా..? లైట్ తీసుకోవద్దు.. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి..!
అకస్మాత్తుగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా నడుము కింది భాగంలో ఉంటే.. దాన్ని తేలికగా తీసుకోకూడదు. నిపుణుల ప్రకారం ఇలాంటి నొప్పి కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లకు గుర్తు కావచ్చు. మూత్రంలో రక్తం, మంట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.

మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం పోసేటప్పుడు మంట లేదా ఇబ్బంది, వీపు, పొత్తికడుపులో నొప్పి, వాంతులు లేదా వికారం లాంటివి కిడ్నీ స్టోన్స్ ముఖ్యమైన లక్షణాలు. చాలా మంది వీటిని మామూలు వెన్నునొప్పిగా పొరబడతారు. కానీ ఆలస్యం చేస్తే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
కిడ్నీ స్టోన్స్‌ను పట్టించుకోకపోతే అవి మూత్రనాళంలో అడ్డుగా మారి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీస్తాయి. అలాగే రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరిగి మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
పరీక్షలు, నిర్ధారణ
ఈ సమస్య ఉందని అనుమానం ఉంటే.. డాక్టర్లు సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్, మూత్ర పరీక్ష, క్రియాటినిన్ టెస్ట్ చేయమని సూచిస్తారు. వీటి ద్వారా రాళ్ల సైజు, అవి ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు.
నివారణకు మార్గాలు
రాళ్ల రకం ఆధారంగా చికిత్స తీసుకోవడం అవసరం. అలాగే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం వల్ల రాళ్లు రాకుండా చూసుకోవచ్చు.
నిర్లక్ష్యం వద్దు
కిడ్నీ స్టోన్స్‌ను లైట్ తీసుకుంటే తీవ్రమైన నొప్పి మాత్రమే కాకుండా.. దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కాబట్టి లక్షణాలను త్వరగా గుర్తించి పరీక్షలు చేయించుకుని నివారణ చర్యలు పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.




