30లో కూడా యంగ్ గా ఉన్నామనుకుంటున్నారా..? ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ టెస్టులు చేయించాల్సిందే..!
30 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంపై జీవనశైలి, ఆహారం, ఒత్తిడి వంటి వాటి ప్రభావం బాగా పడుతుంది. ఈ దశలో మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ముందుగానే తెలుసుకోవాలంటే.. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం.

30 ఏళ్ల వయసులో చాలా మంది నేనింకా యంగ్ గానే ఉన్నాను.. పాత కాలంలో లాగే ఫిట్‌గా ఉన్నాను అని ఫీల్ అవుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఈ వయసు నుంచే సైలెంట్ గా మొదలవుతాయి. వాటిని ముందుగా గుర్తించకపోతే దీర్ఘకాలిక రోగాల కింద మారిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి.
మీరు ఎంత ఫిట్ గా ఉన్నారనే దాన్ని బట్టి డాక్టర్ ను కలిసే సమయం మారుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సంవత్సరానికి ఒకసారి వైద్యుడిని కలిస్తే సరిపోతుంది. కానీ అధిక బరువు ఉన్నవాళ్లు.. కుటుంబంలో ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నవాళ్లు లేదా బాగా స్ట్రెస్ ఫీలయ్యేవాళ్లు ఆరు నెలలకు ఒకసారి నిపుణులను కలవడం మంచిది. మహిళలు గైనకాలజీ టెస్ట్ లు చేయించుకోవాలి. పురుషులు కూడా తమకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అస్సలు మిస్ అవ్వకూడని ఆరోగ్య పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ, షుగర్
రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కనీసం ఆరు నెలలకు ఒకసారి పరీక్షించుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. ఈ పరీక్షను మరింత తరచుగా చేయించాలి.
కొలెస్ట్రాల్ పరీక్ష
చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL), ట్రైగ్లిసరైడ్ స్థాయిలను తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ఇది సంవత్సరానికి ఒక్కసారి చేయాల్సిన పరీక్ష.
లివర్, కిడ్నీ పనితీరు
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం, ఆల్కహాల్, అధిక ఉప్పు, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే సంవత్సరానికి ఒకసారి ఈ టెస్ట్ లు చేయించుకోవడం బెటర్.
థైరాయిడ్ హార్మోన్లు
అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, మూడ్ స్వింగ్స్ లాంటి లక్షణాలు ఉంటే.. థైరాయిడ్ సమస్య ఉండే ఛాన్స్ ఉంది. ప్రతి ఏటా ఈ పరీక్షలు చేయించుకోవాలి.
విటమిన్ D, B12
విటమిన్ D లోపం, B12 లోపం భారతీయుల్లో చాలా కామన్. ఇది ఎముకలు బలహీనపడటం, మానసిక ఇబ్బందులు, మెదడు పనితీరు మందగించడానికి దారి తీస్తుంది. ప్రతి ఏటా ఒకసారి ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
క్యాన్సర్ స్క్రీనింగ్
30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి మూడేళ్లకు ఒకసారి గర్భాశయ క్యాన్సర్ పరీక్ష, బ్రెస్ట్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పురుషులు కూడా ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. వృద్ధాప్యం వచ్చే వరకు వేచి చూడకుండా.. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెస్ట్ మార్గం.
ఆరోగ్య పరీక్షలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. అవి మన శరీరంలో మొదలవుతున్న సమస్యలను ముందే గుర్తించే పవర్ ఫుల్ టూల్స్. మన శరీరం మాటల్లో చెప్పదు.. కానీ సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను గమనించడం మన బాధ్యత. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా.. క్రమం తప్పకుండా రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




