
నిద్ర మనిషికి అత్యంత అవసరం. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో నిద్రకు కూడా తగినంత సమయం ఉండటం లేదు. దీంతో అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన నిద్ర లేకపోతే చికాకుగా.. నీరసంగా.. అలసటగా అనిపిస్తుంది. అయితే రాత్రిళ్లు చాలా మందికి నిద్ర పట్టదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంట్లోని సమస్యలు, ఆఫీసులోని టెన్షన్స్, వివాహ బంధంలో గొడవలు, మనస్పర్థలు ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎంత పని ఉన్నా సరే.. ఓ కునుకు తీస్తే కానీ మనిషి.. మనిషిలా ఉండడు. ప్రతి మనిషికి తగినంత నిద్ర అవసరం. కనీసం 7 గంటలైనా నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే స్లీప్ నాప్స్ అంటే కునుకు పాట్లు తీయడం మంచిదేనా? అంటే మంచిదే అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోని వారు పగలు ఓ కునుకు తీయవచ్చు. దీంతో వారికి హాయిగా ఉంటుంది. అలాగే రాత్రికి నిద్ర ఆటంకం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే.. కొంత మందికి నిద్రపట్టదు కనుక.
అయితే అతి నిద్ర కూడా అంత మంచిది కాదు. మనకు సరిపడనంత నిద్ర పోతే చాలు. కొంత మంది అతిగా పడుకుని అనారోగ్యం చెందిన వారు కూడా ఉంటారు. ఒకవేళ మీరు కునుకుపాట్లు తీయాల్సి వస్తే ఓ అరగంట మహా అయితే గంట అంతకు మించి పగలు పూట పడుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఓ కునుకు తీయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొరియా, జపాన్ వంటి దేశాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగలు ఓ అరగంట పాటు నిద్ర పోయే టైమ్ కూడా ఉంటుంది.
ఇలా చేస్తే వారికి ప్రయోజనాలు కలుగుతాయని, బ్రెయిన్ కూడా ఫ్రెష్ గా, యాక్టీవ్ గా వర్క్ చేస్తుందని అంటారు. కునుకు పాట్లు తీయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని తాజాగా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పగటి పూట కునుకు తీయడం వల్ల ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుందట. అంతే కాకుండా చర్మం కూడా నిర్జీవంగా కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి