Black fungus : షుగర్ పేషేంట్లు కొవిడ్ తగ్గిన తర్వాత ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి : మంత్రి పేర్ని నాని
Minister Perni Nani review : డయాబెటిస్ పేషంట్స్‌లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని, కనుక కరోనా తగ్గిన తర్వాత చక్కర వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్‌ని..
Minister Perni Nani review : డయాబెటిస్ పేషంట్స్‌లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని, కనుక కరోనా తగ్గిన తర్వాత చక్కర వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్‌ని తనిఖీ చేసుకుంటూ ఉండాలని లేదంటే వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పలువురు వైద్యాధికారులతో సమావేశమై కొవిడ్ పరిస్థితిపై ఆయన వారాంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కరోనా రాకుండా ఉండేటట్లు చూసుకోవాలని, వైరస్ రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం ముఖ్యం అని.. ఒకవేళ కనుక మీరు బయటికి వెళితే, తప్పని సరిగా మాస్క్ ధరించి వెళ్ళండని సూచించారు. జూన్ 30 వ తేదీ వరకు ఎంతో అప్రమత్తత అవసరమని, వైద్య అవసరం అయితే మినహా బయటకు వెళ్లడం ప్రస్తుత పరిస్థితులలో ఏ మాత్రం మంచిది కాదని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా నివారణలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్లలో బ్లాక్ ఫంగస్ ప్రస్తుతం వ్యాపిస్తోందని వైద్య నిపుణులు గుర్తించారని మంత్రి వివరిస్తూ, కరోనా ఉదృతి తగ్గించేందుకు ఉత్ప్రేరకాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ ఊపిరితిత్తులలో తగ్గుతుందని తద్వారా అది రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ , డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత , జిల్లా డెప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట , ప్రభుత్వాసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, డ్వామా పి డి , మచిలీపట్నం ఎంపిడిఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.