Baba Ram Dev : తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాబా రాందేవ్.. డాక్టర్లకు క్షమాపణలు చెప్పిన యోగా గురు..
Baba Ram Dev : అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా
Baba Ram Dev : అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ సైతం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. బాబా నేతృత్వంలోని పతంజలి యోగా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంది. వీటిపై బాబాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించింది. బాబా రామ్ దేవ్ పాల్గొన్న ఈవెంట్ లో తనకు అందిన వాట్సాప్ సందేశాన్ని ఆయన చదివారని, అంతే తప్ప ఆయనకు ఆపాదిస్తూ వచ్చిన సమాచారం తప్పుడుదని పేర్కొంది.
అయితే గత రెండు రోజులుగా రామ్ దేవ్ బాబా మాట్లాడిన మాటలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అల్లోపతి విధానాన్ని ఆయన విమర్శిస్తున్నారని, డాక్టర్లను, వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారని, కించ పరుస్తున్నారని అనేకమంది ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు లీగల్ నోటీసును కూడా పంపింది. అటు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ కూడా బాబా రాందేవ్ కి లీగల్ నోటీసు పంపింది.
“అల్లోపతి ఒక కుంటి శాస్త్రం.. మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయి ” అని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది COVID-19 రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, వర్ధ్మాన్ మహావీర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.