కడుపు ఆరోగ్యం బాగా లేకుంటే మూడ్ కూడా బాగోదు. జీర్ణకోశ రుగ్మతల కారణంగా తరచూ కడుపులో నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో దాదాపు ప్రతిరోజూ గ్యాస్ బర్న్ సమస్య వేధిస్తుంది అయితే, ఈ గ్యాస్-గుండె మంట ప్రధాన కారణం గతితప్పిన ఆహారపు అలవాట్లు. నిబంధనలకు విరుద్ధంగా తినడం వల్ల ఈ విధమైన లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నూనె-మసాలా ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ రుగ్మత సమస్య అంత తేలికగా వదిలిపోదు. అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలి. కానీ చాలామందికి ఇంట్లో తయారుచేసిన ఆహారం తిన్న తర్వాత కూడా ఇదే విధమైన జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆహారంతో పాటు, జీవనశైలిని కూడా మార్చుకోవాలి. అజీర్తిని నివారించడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే కడుపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
కొన్నిసార్లు రుచికరమైన, ఫాస్ట్ ఫుడ్ కనిపిస్తే తినకుండా ఉండలేరు. అది పిజ్జా అయినా, బిర్యానీ అయినా.. వీటిని మధ్యాహ్నం భోజనంలో అస్సలు తీసుకోకూడదు. ఇటువంటి భారీ, కొవ్వు పదార్ధాలను మధ్యాహ్నం, రాత్రి సమయంలో తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ అలవాటు మార్చుకుంటే దాదాపు సగం జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది.
బద్ధకంగా జీవించడం వల్ల జీర్ణ సమస్యలను నివారించలేం. మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా భోజనం చేసి పడుకోవడం మంచి అలవాటు కాదు. బదులుగా భోజనం తర్వాత 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు.
తగినంత నిద్ర లేకపోతే గ్యాస్, గుండెల్లో మంట సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా మధుమేహం, స్థూలకాయం, డిప్రెషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి పూట కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి.