Yash: ఇది పాన్ ఇండియా నరుకుడు.. షూటింగ్ కోసం చెట్లన్నీ నరికేశారు.. కట్ చేస్తే…
ఇది పాన్ ఇండియా నరుకుడు.. యశ్ లేటెస్ట్ సిన్మా కోసం పాన్ ఇండియా రేంజ్‌లో చెట్టు కనిపిస్తే నరుకుడు..! సినిమాల్లో తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించినట్టు, ఒంటిచేత్తో వందల మందిని నరికేసినట్టు.. సెట్టు కోసం చెట్లు కొట్టేశారు..! ఈ వార్తలే ఇప్పుడు సంచలనంగా మారాయి..! అసలు యశ్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ విషయంలో ఏం జరిగింది.. సెట్ వెయ్యడం కోసం నిజంగానే వందలాది చెట్లు కొట్టేశారా..!
నిజానికి పాన్ ఇండియా సినిమాల్లో.. పెద్ద హీరోలు భారీ తనాన్నే కోరుకుంటున్నారు. దీంతో భారీ సెట్లు వేయాల్సిరావడం.. అందుకు తగ్గ లొకేషన్లను డైరెక్టర్లు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు కర్నాటకలో బిగ్గెస్ట్ హీరో యష్. కేజీఎఫ్ 2 తర్వాత ఆయన ఏం సినిమా చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. ఇటీవల సాయిపల్లవి హీరోయిన్‌గా టాక్సిక్ అనే మూవీని స్టార్ట్ చేశారు యష్. ఈ సినిమా కోసం భారీసెట్లు వేశారు. అది కూడా ఫారెస్ట్ భూమిలో. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ కొన్ని రోజుల క్రితం బెంగళూరు లోని HMT ల్యాండ్స్‌లో ప్రారంభమైంది. ఇక్కడ భారీ సెట్‌ను వేశారు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఆ భూమిలో చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాధికారులు అక్కడ దిగారు. గతంలో శాటిలైట్ చిత్రాలను.. ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారు. చెట్లు నరికేసినట్లు నిర్థారించుకున్నారు అధికారులు.
అదే సమయంలో అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే యష్ టాక్సిక్ మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. చెట్లు నరికివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీణ్య సమీపంలో ఉన్న ఈ హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగింది. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారన్నారు మంత్రి కండ్రే. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరమన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 599 ఎకరాల భూమిని ఇదివరకే రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించినట్లు అధికారులు చెబుతున్నారు. దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. అయితే HMT సంస్థ ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమంగా వివిధ సంస్థలు, ప్రైవేటు గ్రూపులకు, వ్యక్తులకు భూమిని అమ్మేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మిగిలి ఉన్న భూమిని షూటింగ్స్‌కు ఇస్తూ ధనార్జన చేపడుతున్నారని విమర్శలు మొదలయ్యాయి.
నిజానికి ఈ భూమి HMT సంస్థది. ఆ సంస్థ మూతపడడంతో.. కెనరా బ్యాంకుకు విక్రయించారు. అనంతరం ఆ భూమిలో చెట్ల ప్లాంటేషన్ జరిగింది. చెట్లు నరికేయాలంటే.. అదే ప్రైవేటు ల్యాండైనా.. ప్రభుత్వభూమైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. కాని యష్ మూవీకోసం HMT ల్యాండ్స్‌లోని చెట్లను ఇష్టమొచ్చినట్లు నరికేసి.. షూటింగ్‌కు అనుమతులు ఇచ్చేసుకున్నారు. దీనిపై చర్యలు తప్పవంటున్నారు మంత్రి.
గతంలోనూ ఇక్కడ షూటింగ్స్ జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే ఆ సమయంలో చెట్లు నరికేశారా? ఎలాంటి అనుమతులు తీసుకున్నారనేది కూడా పరిశీలిస్తున్నారు. యష్ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటి? సెట్ తీసేస్తారా? ఫైన్ విధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.