Das Ka Dhamki Movie Review: దాస్ కా ధమ్కీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

ఫలక్‌నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తూ తెరకెక్కించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఆయనే నిర్మాత కూడా. ఉగాది సందర్భంగా ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Das Ka Dhamki Movie Review: దాస్ కా ధమ్కీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Das Ka Dhamki
Follow us

|

Updated on: Mar 22, 2023 | 3:53 PM

మూవీ రివ్యూ: దాస్ కా ధమ్కీ

నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్, అక్షర గౌడ, రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, రంగస్థలం మహేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ: దినేశ్ కె బాబు

ఎడిటింగ్: అన్వర్ ఆలి

సంగీతం: లియోన్ జేమ్స్

నిర్మాత: కరాటే రాజు

దర్శకత్వం: విశ్వక్ సేన్

ఫలక్‌నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తూ తెరకెక్కించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఆయనే నిర్మాత కూడా. ఉగాది సందర్భంగా ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ధమ్కీ ఆడియన్స్‌కు నచ్చిందా..? సినిమా ఎలా ఉంది..? విశ్వక్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా లేదా అనేది చూద్దాం..

కథ: కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వెయిటర్. అనాధ కావడంతో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడుతూ పెరుగుతాడు. అతడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు.. వాళ్లే మహేష్ (మహేశ్), ఆది (హైపర్ ఆది). వాళ్లిద్దరిని అమ్మా నాన్న అని పిలుస్తుంటాడు కృష్ణదాస్. ఇలా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి సడన్‌గా కీర్తి (నివేతా పేతురాజ్) వస్తుంది. తొలి చూపులోనే కృష్ణదాస్ ప్రేమలో పడిపోతుంది. పైగా తనకు డబ్బుుందని కీర్తిని నమ్మిస్తుంటాడు కృష్ణ. ఆమె కూడా అతడు ఓ పెద్ద ఫార్మా కంపెనీకి CEO అనుకుని ప్రేమిస్తుంది. కానీ ఆ తర్వాత అదంతా మోసం అని తర్వాత తెలుస్తుంది. అదే సమయంలో అసలు CEO సంజయ్ (విశ్వక్ సేన్) ఓ రోడ్ యాక్సిడెంటులో చనిపోతాడు. ఆ స్థానంలో కృష్ణదాస్‌ను నటించమని అడుగుతాడు సంజయ్ బాబాయ్ (రావు రమేష్). ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం: హీరో ద్విపాత్రాభినయం చేయడం.. ఒకరు సమస్యల్లో ఉంటే.. మరొకరు వచ్చి వాళ్లను కాపాడటం అనేది ఇప్పుడు కాదు.. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఫార్ములా. ఈ కథనే మరోసారి ధమ్కీలోనూ చూపించాడు దర్శకుడు కమ్ హీరో విశ్వక్ సేన్. కాకపోతే అందులో కొన్ని ట్విస్టులు పెట్టాడు. అవి సినిమా చూస్తే కానీ అర్థం కావు.. ఇప్పుడు చెప్తే సినిమా చూడాల్సిన అవసరం ఉండదు. మొదటి అరగంట కేవలం హీరో హీరోయిన్ ట్రాక్ మీదే నడుస్తుంది కథ. బాగా నెమ్మదిగా సాగే బోరింగ్ ట్రాక్ ఇది. పైగా డబ్బుందని మోసం చేసే క్రమంలో విశ్వక్ సేన్ వేసే వేశాలు చాలా సినిమాలను గుర్తుకు తెస్తాయి. హోటల్ వెయిటర్‌గా ఉండి.. డబ్బులున్న అమ్మాయిని మేనేజ్ చేయడానికి పడే తంటాలు కాస్త కామెడీ పుట్టించాయి. అయితే అసలు కథలోకి వెళ్లే వరకు మాత్రం స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కథ కూడా ఊహించదగ్గదిగానే ఉంటుంది కానీ ట్విస్టులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రెండో విశ్వక్ సేన్ కారెక్టర్ మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది. అసలు ఎవరూ ఊహించని రేంజ్‌లో ఆ పాత్రను డిజైన్ చేసాడు దర్శకుడు విశ్వక్. అందులో ఆయన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. క్లైమాక్స్ టైటిల్స్ పడిన తర్వాత కూడా కథను ముందుకు నడిపించిన తీరు బాగుంది. సెకండ్ పార్ట్ ఉంటుందనే విషయాన్ని చాలా బాగా నెరేట్ చేసాడు విశ్వక్. ఓవరాల్‌గా ట్విస్టులున్నా సగటు యావరేజ్ సినిమాగా నిలిచింది ధమ్కీ.

నటీనటులు: విశ్వక్ సేన్ రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో కారెక్టర్ అయితే సూపర్. అది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. ఆ కారెక్టర్ రివీల్ చేస్తే థ్రిల్ పోతుంది. నివేదా పేతురాజ్ కారెక్టర్ ఆకట్టుకుంటుంది. గ్లామర్ షో కూడా బాగానే చేసింది ఈమె. హైపర్ ఆది, మహేష్ కారెక్టర్స్ ఓకే. రావు రమేష్‌కు మంచి పాత్రే పడింది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం: ఈ సినిమాకు లియో జేమ్స్ ఇచ్చిన సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ చాలా వీక్‌గా అనిపించంది. అదే సెకండాఫ్ మాత్రం పరుగులు పెట్టించారు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ మరోసారి రొటీన్ కథనే ఇచ్చాడు కానీ దర్శకుడిగా విశ్వక్ మాత్రం దాన్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్: దాస్ కా ధమ్కీ.. రొటీన్ బట్ ఎంగేజింగ్ డ్రామా..