అన్నామలై రియల్ సింగం.. ఆయన చాలా ఇంటెలిజెంట్: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో రణబాలి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు అన్నామలై, ప్రముఖ న్యాయవాది జె. సాయి దీపక్తో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతదేశ చరిత్ర, బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న పరిణామాలు, ‘రణబాలి’ కథకు సంబంధించిన చారిత్రక నేపథ్యం వంటి అంశాలపై ఈ నలుగురి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.
‘రణబాలి’ కథ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ఇండియాలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందినట్లు చిత్ర బృందం వెల్లడిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు పరిస్థితులు, ఆ కాలంలో బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరిత్రలోని కీలక ఘట్టాలను వెండితెరపై చూపించాలనే ప్రయత్నం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా, అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన పోరాటం, వలస పాలన వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో అన్నామలై, సాయి దీపక్ తమ అభిప్రాయాలను పంచుకోగా.. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ సినిమా నేపథ్యం, దాని వెనుక ఉన్న ఆలోచనల గురించి మాట్లాడారు. చిత్ర బృందానికి అన్నామలై అభినందనలు తెలిపారు. అలాగే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘రణబాలి’కి ఎలా అయితే ‘ది లెజెండ్ ఆఫ్ కర్ష్ ల్యాండ్’ అనే ట్యాగ్ లైన్ ఉందో.. అన్నామలైకి కూడా ‘రియల్ సింగం’ అనే ట్యాగ్లైన్ ఉంది. దీని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అన్నామలై ఇంటర్వ్యూలు చూశాను. ఆయన చాలా ఇంటెలిజెంట్. షార్ప్ గా ఎంతో నాలెడ్జ్ తో మాట్లాడతారు. నిజంగా మన దేశంలో అన్నామలై లాంటి బాగా మాట్లాడే పొలిటీషియన్స్ ను చూడటం నాకు బెస్ట్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక యంగ్ స్టర్ గా నాకు అలాంటివి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అన్నామలై ఒక ప్రామిసింగ్ లీడర్ అని విజయ్ అన్నారు. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రణబాలి సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
