
ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. గతంలో ఆయన నటించిన బిచ్చగాడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు 2. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించగా.. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మే 19న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ హీరోస్ అడివి శేష్, ఆకాష్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. బోటు ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విజయ్ మాట్లాడుతూ “అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఎలా మథనపడతారో.. డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చేటప్పుడు దర్శకనిర్మాతలు అలానే ఫీలవుతారు. ఈ సినిమా విషయంలో నాకు అలాంటి బాధే లేదు. సరైన వ్యక్తుల చేతిలో ఈ సినిమాను పెట్టాం. ఎడిటింగ్, మ్యూజిక్, డైరెక్షన్.. ఇలా టెక్నికల్ వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నింటినీ గేయ రచయిత భాష్యశ్రీ చూసుకునేవారు. నేను చేసిన చిన్న పొరపాటు కారణంగానే షూటింగ్ లో బోటు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నన్ను కావ్యా థాపర్ రక్షించింది. ఈ సినిమాను మిమ్మల్ని నిరాశపరచదు. ” అని అన్నారు.
ఇక అడివి శేష్ మాట్లాడుతూ.. “నా సినిమా కథలను నేను రాసుకుంటున్నాననే గర్వంగా ఫీలయ్యేవాణ్ని. కానీ విజయ్ ఆంటోనిగారు దర్శకత్వం, ఎడిటింగ్, సంగీతం.. ఇలా సినిమాకు సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన్ను చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. బిచ్చగాడు సినిమాలోని పుదుచ్చేరి కారు సన్నివేశం చాలా ఇష్టం. ‘బిచ్చగాడు 2’లో విమానాల గురించి చర్చించారేమో” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.