AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thodelu Review: మనిషి మృగంగా మారితే.. ఆకట్టుకుంటోన్న తోడేలు మూవీ

బారియర్స్ చెరిపేసి పాన్ ఇండియన్ సినిమాలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అందుకే అన్ని భాషల సినిమాలు.. అన్ని ఇండస్ట్రీల్లో విడుదలవుతున్నాయి.

Thodelu Review: మనిషి మృగంగా మారితే.. ఆకట్టుకుంటోన్న తోడేలు మూవీ
Thodelu
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 25, 2022 | 2:28 PM

Share

సినిమా రివ్యూ: తోడేలు

నటీనటులు: వరుణ్ ధావన్, కృతి సనన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్, దీపక్ డోబ్రియాల్‌ తదితరులు

సినిమాటోగ్రఫర్: జిష్ణు భట్టాచార్య

ఇవి కూడా చదవండి

సంగీతం: సచిన్ – జిగర్

నిర్మాతలు: దినేష్ విజయన్, జియో స్టూడియోస్ తెలుగు వర్షన్ విడుదల: అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)

దర్శకత్వం: అమర్ కౌశిక్

విడుదల తేదీ: నవంబర్ 25, 2022

బారియర్స్ చెరిపేసి పాన్ ఇండియన్ సినిమాలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అందుకే అన్ని భాషల సినిమాలు.. అన్ని ఇండస్ట్రీల్లో విడుదలవుతున్నాయి. అలా వచ్చిన సినిమా తోడేలు. హిందీలో భేడియాను తెలుగులో తోడేలుగా విడుదల చేసారు గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..?

కథ:

భాస్కర్ (వరుణ్ ధావన్) ఓ రోడ్డు కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ధట్టమైన అడవి ప్రాంతంలో ఓ రోడ్డు వేయడానికి వెళతాడు. అక్కడ రోడ్డు పడాలంటే.. అడవిలో ఉన్న చెట్లతో పాటు ఇంకా చాలా వాటిని నాశనం చేయాల్సి వస్తుంది. దానికి అక్కడి గ్రామస్థులు ఒప్పుకోరు. దానికోసం ప్రయత్నాలు సాగుతుండగానే.. భాస్కర్‌ను ఒక తోడేలు కరుస్తుంది. తన స్వార్థం కోసం అక్కడి పచ్చటి ప్రకృతిని పాడైపోయినా పర్లేదంటాడు. డబ్బు కోసమే అంతా అనుకుంటాడు. ఆ సమయంలోనే తోడేలు కరవడంతో.. తర్వాత ఏమైంది..? ఆ ప్రాంతంలో ప్రకృతికి ఎవరైనా హాని తలపెడితే ఓ వైరస్ దాడి చేస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. మరి ఏంటా వైరస్.. తోడేలు కరిచిన భాస్కర్ పరిస్థితి ఏంటి..? అతడికి పశువుల డాక్టర్ అనీక (కృతి సనన్) తో సంబంధం ఏంటి..? అనేది అసలు కథ..

కథనం:

కొత్తదనం కొంతవరకు బాగానే ఉంటుంది కానీ మరీ ఎక్కువైతే మాత్రం కచ్చితంగా సమస్యలు తెచ్చి పెడుతుంది. తోడేలు సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఎందుకంటే ఈ చిత్ర కథ బాగుంది.. కాన్సెప్ట్ కూడా అందంగా ఉంటుంది.. ఆకట్టుకుంటుంది కూడా. కానీ తీసిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను రన్ చేసిన దర్శకుడు.. ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. సినిమా మొదటి 20 నిమిషాలు ఏమంత ఉండదు. హీరో పరిచయం.. అతడికి కాంట్రాక్ట్ రావడం.. దానికోసం స్నేహితులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ రావడం.. ఓ పాట అలా సాగిపోతుంది అంతే. వరుణ్ ధావన్‌ను తోడేలు కరిచిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ఈయనలో వచ్చే మార్పులు.. మధ్యలో మనుషులపై వరుణ్ చేసే దాడులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది.. మనిషి తోడేలుగా మారే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదే సెకండాఫ్‌పై మరింత ఉత్కంఠ పెంచుతుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో దర్శకుడు అమర్ కౌశిక్ తడబడ్డాడు. ట్విస్టులు ఊహించినట్లుగానే ఉన్నాయి.. పైగా స్క్రీన్ ప్లే కూడా మామూలుగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మినహా మిగిలిన కథ అంతా సాదాసీదాగానే సాగింది. మనిషి తోడేలుగా మారడం అనేది సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కృతి విషయంలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం లాజిక్ లేకుండా ఉంది. ‘తోడేలు’ కథ ఎమోషనల్‌గా ఉంటుంది.. కానీ దర్శకుడి ఫోకస్ మాత్రం కామెడీపైనే ఉండిపోయింది. సీరియస్ సీన్స్‌లో కూడా కామెడీ వైపు పరుగులు పెట్టడం కథపై ప్రభావం చూపించింది. ఫస్టాఫ్ వరకు బాగానే వర్కవుట్ అయిన కామెడీ.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేలిపోయింది. అదే సినిమాకు మైనస్ అయింది కూడా. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మరీ కన్ఫ్యూజింగ్‌గా ఉండిపోయింది. హడావిడిగా ముగించినట్లు అనిపిస్తుంది. అలాగే కథలో కొన్ని లోపాలు కూడా అలాగే ఉండిపోయాయి. 120 ఏళ్ళ వైద్యుడిని కథలో ప్రధానంగా చూపించారు కానీ ఆయన పాత్ర మాత్రం తర్వాత వాడుకోలేదు. అలాంటి లోపాలు కొన్ని ఉండిపోయాయి.

నటీనటులు:

వరుణ్ ధావన్ అద్భుతంగా నటించాడు. ఆయన ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. ముఖ్యంగా ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాడు. తోడేలుగా అతడు నటించిన తీరు చాలా బాగుంది. కృతి సనన్ పాత్ర బాగుంది. ఆమె కూడా చాలా బాగా నటించారు. క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. సపోర్టింగ్ కారెక్టర్స్ చేసిన నటులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ అభిషేక్ బెనర్జీ అద్భుతమైన కామెడీ టైమింగ్‌‌తో కనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సినిమాలో మ్యూజిక్ బాగుంది. పాటలు తెలుగులో ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ బావున్నాయి. 3డి సీన్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు చాలా మంచి థ్రిల్ ఇచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ అడవులను చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకు త్రీడీ అవసరం లేదు కానీ కొన్ని సీన్స్ కోసమే దర్శకుడు 3డి చేసాడని అర్థమవుతుంది. దర్శకుడి ఆలోచన బాగున్నా.. ఆచరణ ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

తోడేలు.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.. కానీ కండీషన్స్ అప్లై