టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం (జూన్ 03) మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్ మీద బండ్ల గణేష్ ఇబ్బందులు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. ఓ నర్సు బండ్ల గణేష్‌కు సెలైన్ పెడుతూ కన్పించింది. అదే సమయంలో ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బండ్లన్నకు ఛాతీలో నొప్పి, తీవ్ర అసౌకర్యంగా ఉండటంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోల్లో ఆయన తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించగా.. వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు. ఈ వీడియోలను చూసిన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, స్నేహితులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బండ్లన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ‘ బండ్ల గణేశ్ కు వైద్య పరీక్షలు నిర్వహించాం. కొంత ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వీలైనంత త్వరగా ఆయనను డిశ్చార్జ్ చేస్తాం’ అని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కాగా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు బండ్ల గణేశ్. కాంగ్రెస్ నేతగా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉంటూ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందంటూ బల్లగుద్ది చెప్పటమే కాకుండా.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే ఎల్బీ స్టేడియంలో వచ్చి పడుకుంటానంటూ ధీమా వ్యక్తం చేయటమే కాకుండా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కాగా గతంలో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో భారీ సినిమాలు నిర్మించి బంపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు బండ్ల గణేశ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs
— Madhu (@offlinemadhu) June 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.