Anushka Shetty: ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన జేజమ్మ.. తన జీవితాన్ని మార్చింది అదేనట
నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యోగా బోధకురాలిగా మారడం’ అంటూ అనుష్క కొన్ని యోగాసనాలను వేసిన వీడియో అభిమానులతో పంచుకుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజం పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏ ఆసనాలు బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయో మనమూ తెలుసుకుందాం..

టాలీవుడ్ జేజమ్మగా రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘బాహుబలి’ సిరీస్‌తో మరోసారి పాన్ఇండియా క్రేజ్ సంపాదించుకుని తనకు తానే సాటి అని నిరూపించుకుంది స్వీటీ.
‘సైజ్ జీరో’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రలను పోషిస్తూ ఈతరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవలే 44వ పుట్టినరోజు జరుపుకున్న అనుష్క తన ఫిట్నెస్ సీక్రెట్స్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న పోస్ట్ మరోసారి వైరల్గా మారింది.
‘నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యోగా బోధకురాలిగా మారడం’ అంటూ అనుష్క కొన్ని యోగాసనాలను వేసిన వీడియో అభిమానులతో పంచుకుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజం పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చాలామంది సెలబ్రిటీలు యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. ఏ ఆసనాలు బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయో మనమూ తెలుసుకుందాం..
అనుష్క యోగాసనాలు..
View this post on Instagram
సూర్య నమస్కారం (Surya Namaskar – Sun Salutation)
ఇది ఒక డైనమిక్ సీక్వెన్స్ – 12 ఆసనాల కలయిక. ఈ ఆసనం వల్ల పూర్తి శరీరానికి వర్కౌట్ అవుతుంది. రోజూ 5-10 సార్లు సూర్యనమస్కారాలు చేయడం వల్ల మెటబాలిజం పెరగడమే కాకుండా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
చతురంగ దండాసనం (Chaturanga Dandasana – Plank Pose)
ప్రతిరోజూ 30 సెకన్ల నుంచి 1 నిమిషం పాటు ఈ ఆసనం వేయడం వల్ల చేతులు, భుజాలు, కాళ్లు అన్నింటికి తగిన వ్యాయామం అందుతుంది. శరీర భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది.
వీరభద్రాసనం (Virabhadrasana – Warrior Pose I, II, III)
ఈ ఆసనం ద్వారా శరీర కింది భాగానికి తగినంత వ్యాయామం జరుగుతుంది. కాళ్లు, తొడల కండరాలు దృఢంగా తయారవుతాయి. ఈ ఆసనాన్ని రోజూ 30–45 సెకన్లు వేస్తే మెటబాలిక్ రేటు పెరిగి రోజంతా కేలరీలు ఖర్చవుతూనే ఉంటాయి.
భుజంగాసనం (Bhujangasana – Cobra Pose)
ఈ ఆసనం వల్ల పొట్ట కండరాల్లో మంచి వ్యాయమం జరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ భంగిమ వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదపడుతుంది. రోజుకి మూడుసార్లు 15–30 సెకన్లపాటు ఈ ఆసనాన్ని వేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.
అధోముఖ శ్వానాసనం (Adho Mukha Svanasana – Downward-Facing Dog)
‘V’ ఆకారంలో శరీరాన్ని వంచడం వల్ల చేతులు, భుజాలు, కాళ్లల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీర బరువు, ఒత్తిడి కూడా నియంత్రణలో ఉంటాయి. రోజూ 30–60 సెకన్లపాటు ఈ ఆసనాన్ని వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నావాసనం (Navasana – Boat Pose)
రోజుకి 20–45 సెకన్లపాటు మూడుసార్లు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మెటబాలిజం మెరుగుపడటంతోపాటు కేలరీలను ఖర్చు చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో కూర్చుని, కాళ్లు మరియు శరీరాన్ని ‘V’ ఆకారంలో ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల వెన్నెముకకు బలం చేకూరుతుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
హలాసనం (Halasana – Plow Pose)
ఈ ఆసనంలో శరీరాన్ని పూర్తిగా మడతపెట్టి కాళ్లు తలపైకి ఎత్తి, పాదాలు గ్రౌండ్‌కు తగిలేలా చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నెముకను స్ట్రెచ్ చేసి, ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆసనాన్ని రోజువారీ రొటీన్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యవంతంగా, యవ్వనంగా కనిపిస్తారు.
క్రమం తప్పకుండా యోగా చేస్తూనే సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.. మరెందుకు ఆలస్యం, మీరూ ట్రై చేసేయండి మరి!




