
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తోన్న మురళీ నాయక్ అమరుడయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లి తాండ గ్రామానికి చెందిన మురళీ పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లోఅగ్నివీర్ గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తోన్న ఈ జవాన్ భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్ కు వచ్చాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహరా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళీ. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. కాగా మురళీ నాయక్‌కు నివాళి అర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలి వస్తున్నారు. అతని తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ మురళీ నాయక్ ఇంటికి వెళ్లింది. అతని సమాధి దగ్గర నివాళులు అర్పించింది.
కళ్లితాండలో ఉన్న మురళీ తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పింది మిత్రా శర్మ. దేశం ఒక గొప్ప వీరుడ్ని కోల్పోయిందని.. ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది. ఈ సందర్భంగా మురళీ తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ టాలీవుడ్ హీరోయిన్. ‘ మనం గొప్ప వీరుడ్ని కోల్పోయాం’ అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మిత్రా శర్మని ప్రశంసిస్తున్నారు. ఒక చిన్న హీరోయిన్ అయినా చాలా గొప్ప పని చేసిందంటూ మిత్రా శర్మకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిత్రా శర్మ. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఇటీవల మిత్రా నటించిన కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో శ్రీహాన్ హీరోగా నటించాడు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.