డ్యాన్స్ కాస్ట్యూమ్‌లో అందంగా నవ్వుతోన్న ఈ చిన్నదాన్ని చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారు కదా..! జాగ్రత్తగా చూస్తే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టడం అంతకష్టమేమీకాదు. అందేంటీ హీరో వినీత్ పోలికలు కనిపిస్తున్నాయని సందేహిస్తున్నారా..! ఐతే వినీత్‌కు అక్కచెల్లెళ్లు ఎవ్వరూ లేరు. మరెవరీ అమ్మాయి అని మళ్లీ తలలు గోక్కుంటున్నారా.. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మువీల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినీత్ ఫొటోనే ఇది.
విలక్షణ నటుడిగానేకాకుండా వినీత్ మంచి డ్యాన్సర్ కూడా. సీనియర్ సినీ నటి, నర్తకి శోభనకు వినీత్ స్వయానా కజిన్ కూడా. వినీత్ చిన్నతనం నుంచే భరతనాట్యంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. రాష్ట్రస్థాయి స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో భరతనాట్యం పోటీల్లో వరుసగా నాలుగుసార్లు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ సమయంలో దిగిన ఫొటోనే ఇది. ఇక సినిమాల విషయానికొస్తే.. 1985లో ఐవీ శశి దర్శకత్వంలో విడుదలైన ‘ఇదనిలమనల్’ అనే మలయాళ మువీలో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. తర్వాత హీరోగా, సహనటుడిగా, విలన్‌గా ఎన్నో పాత్రలు పోషించాడు. 1986లో విడుదలైన నక్కాషామనల్ మువీతో పాపులారిటీ దక్కించుకున్నాడు. 2004లో వినీత్‌కు పెళ్లయింది. అతని భార్య ప్రిసిల్లా మీనన్. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.
తాజాగా వినీత్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేయడం ప్రారంభించాడు. ‘లూసిఫర్’, ‘మరాకార్’ మువీలకు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డులు కూడా దక్కించుకున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవార్డు రావడం ఇదే తొలిసారి అని, ఇది తనకు రెండో రాష్ట్ర అవార్డని వినీత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2016లో ‘కాంభోజి’ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు కూడా గెల్చుకున్నారు. తెలుగులో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం వినీత్ బిజీబిజీగా ఉన్నాడు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.