Fish Venkat: వెంటిలేటర్‌పై నటుడు ఫిష్ వెంకట్.. సాయం కోసం ఎదురు చూస్తోన్న భార్య.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

తెలుగు సినిమాల్లో కామెడీ విలన్ గా మనందరినీ కడుపుబ్బా నవ్వించిన నటుడు ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సాయం చేసి తన భర్తను కాపాడండని అతని భార్య వేడుకుంటోంది.

Fish Venkat: వెంటిలేటర్‌పై నటుడు ఫిష్ వెంకట్.. సాయం కోసం ఎదురు చూస్తోన్న భార్య.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Fish Venkat

Updated on: Jul 01, 2025 | 9:47 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి నటుడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నాడు. దీని తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్‌ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో  అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 

ఇవి కూడా చదవండి

 

డాక్టర్లు ఏమంటున్నారంటే..

ప్రస్తుతం ఫిష్‌ వెంకట్‌కు డయాలసిస్‌ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  అతడున్న పరిస్థితుల్లో డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. కాగా క‌మెడియ‌న్‌గా, విల‌న్‌గా న‌టించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు  ఫిష్ వెంక‌ట్‌. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన ఆది చిత్రంలో ఆయ‌న చెప్పిన తొడ గొట్టు చిన్న డైలాగ్ ను ఎవ్వ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.  దాదాపు వందకు పైగా చిత్రాల్లో, అంద‌రూ స్టార్ హీరోల‌తో కలిసి న‌టించారు వెంకట్. అలాంటిది ఇప్పుడాయన దీన పరిస్థితిలో ఉండడాన్ని చూసి సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు హీరోలు వెంకట్ కు సాయం చేయాలని , అలాగే మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) కూడా ఫిష్ వెంకట్ ను అండగా నిలవాలని కోరుతున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..