Tollywood: ఈయన్ను గుర్తుపట్టారా..? తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు.. పడిపోతుంటే పట్టుకుంటాడు..

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? పల్లవిని పడి కట్టు పదజాలం నుంచి విముక్తి కల్పించిన వాడు.. చరణాన్ని చెంగు చెంగును గంతులేయించిన గీతకారుడు.. తెలుగు సినీ గేయాలకు సరసస్వర సురఝరీ గమనాలను అద్దినవాడు.. ఆది భిక్షువును తన పదపుష్పాలతో అర్చించడం మాత్రమే కాదు ప్రశ్నించినవాడు.. జగమంత కుటుంబం నాదీ అంటూ.. వసుదైక కుటుంబ స్ఫూర్తి నింపినవాడు..

Tollywood: ఈయన్ను గుర్తుపట్టారా..? తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు.. పడిపోతుంటే పట్టుకుంటాడు..
Poet Teenage Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2023 | 5:56 PM

చెమట చుక్కను చమురుగా చేసి సూర్యుడిని వెలిగిద్దాం రమ్మంటాడు..! పూసే ప్రతి చెట్టుకు అగ్నిపూలు పూయిద్దామంటాడు..! రివ్వున ఎగిరే పిట్ట రెక్క ముందు.. ఆకాశం ఓడిపోతుంది అంటాడు..! మనిషిని గెలిపించడానికి ఎంత తాపత్రయపడ్డాడో..! స్ఫూర్తిని రగిల్చడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు వెచ్చించాడో..! ఎందుకు అంత ప్రేమ సమాజమంటే..? ఎందుకంత ఇష్టం భారతీయమంటే..?? రాసింది సినిమా పాటలే కావచ్చు. కానీ వేల పాటల్లోని భావ సాహిత్యంతో తెలుగు భారతికి సంధ్యాహారతులు పట్టాడు..!! వెండితెరపై సనాతన భారతీయ జీవన సంవిధానాన్ని ఆవిష్కరించిన కవి శిఖరం.. పైన ఫోటోలో ఉంది తెలుగు జాతి గర్వించ దగ్గ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఏ సినిమాకా సినిమా కొత్త సినిమాగా..  ఏ దర్శకుడికా దర్శకుడు కొంగొత్తగా.. ఏ పాటకా పాట లేలేతగా.. ఇవాళే ఇపుడే ఇండస్ట్రీకొచ్చిన గీత రచయితగా..  భావిస్తూ.. ఏ పాటా తిరిగి రాయని.. ఏ పూటా పాతబడని.. ఏ గంటా మెత్తబడని.. ఉన్నన్నాళ్లూ  ఏ నిమిషం నిష్క్రమించని.. ఏ క్షణం విశ్రమించని కవి శిఖరం సిరివెన్నెల. పాటకు ఎవరైనా పదం కడతారు.. గీతానికి ఎవరైనా రాగాలాపన అద్దుతారు.. అక్షరాలకు ఎవరైనా అర్ధాలను ఆపాదిస్తారు..  కానీ ఆయన పాటల నుంచి ఏకాగ్రత ఝూంకార నాదమవుతుంది.. ఆయన గీతాల నుంచి భావావేశం ఎగదన్నుకొస్తుంది.. ఆయన గేయం గాయాలను మాన్పేంత శక్తినిస్తుంది.. క్లాసు రూమున తపస్సులెందుకుంటూనే క్లాస్ పీకుతుంది.. సామజవరగమనా అంటూ సుతిమెత్తంగా వినిపిస్తూనే.. ఛలొరే ఛలోరె ఛల్ అంటూ తట్టిలేపుతుంది.

సరీగమా పదనీస్సా అంటూ హుషారునిస్తూనే.. పరుగులు తీయకే పసిదానా అంటూ నిలుపూ నిదానం నేర్పుతుంది. ఏక్ బార్ ఏక్ బార్ అంటూ స్టెప్పులేస్తూనే.. అల్లంత దూరాల ఆ తారక అంటూ.. తత్వాన్ని బోధిస్తుంది.. జగమంత కుటుంబమై కనిపిస్తుంది. అవ్వాయి తువ్వాయిలాడిస్తుంది.. గుండెల్లో ఏముందో తెలియ చేస్తుంది.. నేను నేనులా లేనే అంటూ కన్ ఫ్యూజ్ చేస్తుందీ.. నరనరం ఉలిక్కిపడేలా చేస్తుంది.. నే తొలిసారిగా కలగన్నదేంటో చెప్పేస్తుంది.. నా ప్రాణమా సుస్వాగతం అంటూ ఆహ్వానాలు పలుకుతుంది.. ఆకాశం దిగి వచ్చి.. పచ్చటి పందిళ్లు వేసినట్టే కనిపిస్తుంది..అలనాటి రామచంద్రుడి కన్నింటా దర్శనం చేయిస్తుంది.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఓ తారక మొత్తంగా పాటల పల్లకిపై ఊరేగే చిరుగాలనిపిస్తుంది.. కోయల పాట బాగుందనిపిస్తుందీ..రామచిలుకల చేత రాగాలాపన చేయిస్తుంది.  అల్లో నేరేడు కళ్లదానా అంటూ.. ఆ కళ్లలోని కవితాత్మకత ఎత్తి చూపుతుంది. అపుడపుడూ అసలేం గుర్తుకు రాదంటూ.. నిర్వేదం పోతుంది. చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకూ బంధువయ్యే మనీ మంత్రాలను విడమరిచి చెబుతుంది.. ఇలా ఎన్నని చెప్పాలి.. ఏమని వినిపించాలి? మొత్తంగా సిరివెన్నెల అక్షర బంధువు.. పదాల స్నేహితుడు.. పాటల నాయకుడు.

Sirivennela Seetharama Sast

Sirivennela Seetharama Sast

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.