నందమూరి తారకరత్న మృతి చిత్ర సీమలో విషాదం నింపింది. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ.. శివరాత్రి రోజే శివైక్యం చెందారు. ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెలబ్రెటీలు.. ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి.. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నందమూరి అభిమానులు.
“పదవి ఏముంది.. పార్టీయే మాది.. ఎప్పటికీ ప్రజల కోసమే మా పోరాటం.. పోరాడుతూనే ఉంటాం. సామాన్యుడిగా పోరాడాను… నాయకుడిగా కూడా పోరాడతాను. ఎన్టీఆర్ నా తమ్ముడే కదా.. జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు.. ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ.. నందమూరి రక్తం. నా తమ్ముడు ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడే.. అన్నకి తమ్ముడిపై ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
కొద్ది రోజుల క్రితం టీడీపీ పార్టీలో చేరి.. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుప్పం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారడంతో బెంగుళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న రాత్రి తుదిశ్వాస విడిచారు.