S. V. Krishna Reddy: ‘ఆయన నటనలో ఒక అద్భుతం అంతే’.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇప్పుడు యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో..

ఇటీవల కాలంలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కథలో బలం ఉంటే చాలు ఆ సినిమా మంచి హిట్ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి ట్రైలర్, టీజర్‌లను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్‌లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఆ సమయంలో అచ్చిరెడ్డి ఫోన్ చేసి, రేయ్ నువ్వు ఖాళీగా ఉంటే అద్భుతంగా వచ్చిన ఈ కథను మళ్లీ మెరుగులు దిద్దుతూ పాడుచేస్తావేమో అనిపిస్తోంది. ఓపని చెయ్.. ఈ కథను అలాగే లాక్ చేసేసి దీనికి మాటలు రాయి అన్నాడు. దానికి నేను మాటలు రాయడం ఏంట్రా.. అని నా పని కాదు కదా అన్నాను. దానికి వాడు డైరెక్షన్ నీ పనా? కథ రాయడం నీపనా?, స్క్రీన్‌ప్లే నీ పనా?, సంగీతం నీ పనా? అవన్నీ చేయలేదా.. ఏంటి?. ఈ మాటలు కూడా రాయగలవు. నేను చెపుతున్నా రాయి అన్నాడు. అచ్చిరెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అయ్యా.. ఇప్పుడు ఈ సినిమాకు మాటలు కూడా రాశాను అన్నారు. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఆయన నటనలో ఒక అద్భుతం అంతే. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి ఆమె సూపర్ నటి. ఈ సినిమా టైటిల్ కల్పనగారే పెట్టారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి.







