Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!
మ మ మ మ మ మ మహేషా.. అనే పాట చూసి అందరూ సర్కారు వారి పాటలో మహేష్ ఇంకో రేంజ్‌లో మాస్‌గా కనిపిస్తారనే అనుకున్నారు.
మ మ మ మ మ మ మహేషా.. అనే పాట చూసి అందరూ సర్కారు వారి పాటలో మహేష్ ఇంకో రేంజ్‌లో మాస్‌గా కనిపిస్తారనే అనుకున్నారు. మెడ మీద రూపాయి కాయిన్, నాలుగు మాస్ డైలాగులు, మమ మహేషా సాంగ్… ఇవన్నీ మహేష్‌ని మాస్ జోనర్‌లో మరో మెట్టి ఎక్కించేశాయా? ఇంతకీ సర్కారు వారి పాటకు స్పందన ఎలా ఉంది?
సినిమా: సర్కారు వారి పాట
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెం్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: మహేష్ బాబు, కీర్తీ సురేష్, సముద్రఖని, నదియ, నాగబాబు, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, అజయ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ తదితరులు
కెమెరా: ఆర్. మది
ఎడిటింగ్: మార్టాండ్.కె.వెంకటేష్
సంగీతం: తమన్
విడుదల తేదీ: 12 మే, 2022
మహేష్ అలియాస్ మహి చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. తీసుకున్న అప్పులు చెల్లించలేక ప్రాణాలు తీసుకున్న వాళ్లు రూపాయి బిళ్లను, ఓ లెటర్‌ని మహి కోసం వదిలి వెళ్తారు. అక్కడి నుంచి ఓ మిషనరీ పాఠశాలలో చదువుకుంటాడు. ఓ ఫాదర్ సాయంతో ఫారిన్‌లో సెటిలవుతాడు. అక్కడ ప్రైవేట్‌గా వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటాడు. అతని అసిస్టెంట్ కిశోర్ (వెన్నెల కిశోర్). మహేష్ వడ్డీ డబ్బుల్ని పక్కాగా రొటేట్ చేస్తుంటాడు. తన ఫీజులు కట్టడానికి వాళ్ల దగ్గర పది వేల డాలర్లు అప్పు తీసుకుంటుంది కళావతి (కీర్తీసురేష్). అప్పు తీసుకున్న వాళ్లు వడ్డీ డేట్ మిస్ అయితే ఊరుకోని మహేష్.. కళావతి విషయంలో మాత్రం కాస్త పట్టువిడుపులతో వ్యవహరిస్తుంటాడు. తీరా ఆమె డబ్బు తీసుకున్నది చదువుకు కాదని తెలుసుకుని విస్తుపోతాడు. కళావతికి ఇచ్చిన డబ్బును ఆమె తండ్రి నుంచి కలెక్ట్ చేయడానికి వైజాగ్‌కి చేరుకుంటాడు. అయితే అక్కడ అది పది వేల డాలర్లు కాదు… పది వేల కోట్లు అని తెలుస్తుంది. ఇంతకీ పది వేల కోట్లు మహేష్‌కి ఎక్కడివి? కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అంత మొత్తాన్ని ఎందుకు తీసుకున్నట్టు? ఏం చేసినట్టు? మధ్యలో బ్యాంకులు వడ్డీలకు ఇచ్చే డబ్బు సంగతేంటి? లేడీ బ్యాంక్ ఆఫీసర్ ఎందుకు అరెస్ట్ అయినట్టు… ఈ ప్రశ్నలకు లింకు దొరికితే.. అదే సర్కారువారి పాట.
మహేష్ షరామామూలుగా స్క్రీన్ మీద సోలో పెర్ఫార్మెన్స్ చేశారు. ముందు నుంచే చెబుతున్నట్టు మహేష్, కీర్తీసురేష్ ట్రాక్ ఫస్టాఫ్‌లో బావుంది. వాళ్లిద్దరికీ మధ్య సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ వెన్నెల కిశోర్ ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్స్ మెప్పిస్తాయి. నవ్వులు పంచే సీన్లు, కలర్‌ఫుల్ లొకేషన్స్, కథమీద ఎక్స్ పెక్టేషన్స్ తో ఫస్టాఫ్ సాగిపోతుంది. అలాగే వైజాగ్‌లో మహేష్ అడుగుపెట్టిన తర్వాత రాజేంద్రనాథ్ (సముద్రఖని)ని కలిసే సన్నివేశాలు, సుబ్బరాజ్‌తో డైలాగులు బావున్నాయి. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్లు కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కెమెరామేన్ మది తన మార్కును ఇంకోసారి చూపించినట్టే. కానీ కథలో బ్యాంకు గురించి డీటైల్స్ ఎంటర్ అయ్యాక మాత్రం పెద్దగా మెప్పించదు. చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయ్యాయి.
యు.ఎస్. నుంచి వచ్చిన ఓ వ్యక్తి రమ్మంటే.. ఎంపీ రాజేంద్రనాథ్ ఢిల్లీకి వెళ్లడం, అక్కడ తన పరపతిని ఓ కామన్ మేన్‌కి చూపించాలనుకోవడం, జస్ట్ హీరో చెప్పే నాలుగు మాటలకు కాలనీ వాళ్లందరూ రాత్రికిరాత్రి మారిపోవడం, అన్నీ బ్యాంకులకూ ఓ ప్రైవేట్ వ్యక్తి తాళాలు వేయడం, తన మేనకోడలిని హీరో దగ్గరకు సుబ్బరాజు తీసుకెళ్లడం వంటివన్నీ లాజిక్‌కి అందని విషయాలు. సెకండ్ హాఫ్ ఫ్లాట్ నెరేషన్, స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్లు లేకపోవడం, ముందు అత్యంత బలంగా కనిపించిన విలన్.. క్లైమాక్స్ కి తేలిపోవడం.. ఫ్యాన్స్ కి కూడా మింగుడుపడదు.
కళావతి , మ మ మహేషా సాంగ్స్ బావున్నాయి. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. పాటల కోసం వేసిన సెట్లలో నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపించింది. మహేష్ వేసిన స్టెప్స్ కూడా బావున్నాయి. మోడ్రన్ డ్రస్సుల్లోనూ కీర్తీ మెప్పించారు. మహేష్‌కి ఫస్టాఫ్ లో అక్కడక్కడా మేకప్ సెట్ కాలేదనిపించింది. సినిమా మొత్తం మీద పరశురామ్ మార్క్ డైలాగులు బావున్నాయి. ట్రైలర్ చూసిన వారు సర్కారువారి పాటను పూర్తిగా మాస్ స్టైల్‌లో ఊహించుకుంటే, నిరాశ తప్పదు. మహేష్ మార్క్ కమర్షియల్ సినిమాగా చూస్తే పాట నచ్చే అవకాశాలున్నాయి. – డా. చల్లా భాగ్యలక్ష్మి