మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). జెమిని గణేశన్ పాత్రలో జీవించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవల లెఫ్టినెంట్ రామ్‌గా మరోసారి ఆడియన్స్ మనసుకు దగ్గరయ్యాడు. ఎవరు లేని అనాథ ఆర్మీ ఆఫీసర్ అయిన రామ్ గా నటించి మెప్పించాడు. డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించి ఈ సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అడియన్స్ సైతం ఈ సినిమాకు ముగ్దులయ్యారు. ఇక ఇటీవల ముంబైలో జరిగిన సీతారామం సక్సెస్ మీట్లో దుల్కర్ సల్మాన్ ను విలేకర్లు షారుఖ్ ఖాన్‍తో పోల్చారు. దీంతో అంతటి సూపర్ స్టార్‌తో తనను పోల్చడమనేది అతడిని అవమానించినట్లే అన్నారు.
” మొదట నేను షారుఖ్ ఖాన్ ను పెద్ద అభిమానిని. అతను మనందరికీ రోల్ మోడల్. ప్రజలతో ప్రవర్తించేతీరు.. అభిమానులతో కలిసిపోయే విధానం చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా మహిళలతో ఆయన ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. ఎంతమంది అభిమానులు ఉన్నా.. ఆయన ఎంతో శ్రద్దగా మాట్లాడతారు. అంతమందిలో ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఒకే గదిలో ఆయనతో కేవలం ఒక్కరం మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. అతను చాలా ప్రత్యేకమైనవారు. ఆయన చిత్రాలు చాలా ఇష్టం. నా సోదరితో కలిసి DDLJని చూస్తూ పెరిగాను. అది నాకు ఇష్టమైన సినిమా. బలమైన వ్యక్తిత్వం కలవారు. కేవలం నటుడిగానే కాకుండా.. ఎంతో మనోజ్ఞత కలిగిన వ్యక్తి. అందరితో ఎలా మాట్లాడాలి అనేది నేను షారుఖ్ ను చూసి నెర్చుకుంటున్నాను. ఆ హీరోతో నన్ను పోల్చడమనేది దాదాపు అతడిని అవమానించినట్లే. ఎందుకంటే షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉండగలరు” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్.
1960 నాటి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన సీతారామం సినిమాలో రష్మిక మందన్న, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది.