Gunashekar: చిరంజీవితో ఆ సీన్ తీయడం పెద్ద ఛాలెంజ్.. ‘చూడాలని ఉంది’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన గుణశేఖర్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం చూడాలని ఉంది సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ చిత్రంలోని రైల్వే స్టేషన్ సన్నివేశానికి సంబంధించిన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం శాకుంతలం. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు సమంత, డైరెక్టర్ గుణశేఖర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం చూడాలని ఉంది సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ చిత్రంలోని రైల్వే స్టేషన్ సన్నివేశానికి సంబంధించిన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సీన్ ఎవర్ గ్రీన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు పది నిమిషాలపాటు సాగే ఆ సన్నివేశంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు.. కేవలం చూపులతోనే ఉంటుంది. కేవలం చూపులతో.. చిరు. హీరోయిన్ అంజలి జావేరి ప్రేమలో పడడం… వెంటనే హీరోయిన్ హీరోతో వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ సీన్ అప్పట్లో చిరుతో చేయడం ఏంటీ అని ప్రశ్నించారని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. “తొలి ప్రేమ సినిమాతో లవ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి సీన్ బాగుంటుంది. చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోతో ఇలాంటి లవ్ సీన్ చేయడం ఏంటీ అని నన్ను కొందరు ప్రఅశనించారు. అయితే చిరంజీవి గారు మాత్రం నన్ను నమ్మారు. డైలాగ్ లేకుండా 18 పేజీల సీన్ పేపర్స్ రెడీ చేశాను. చిరంజీవి గారికి ఆ సీన్ పేపర్స్ చూపిస్తే..సూపర్ అని అన్నారు.




సీన్ లోని ప్రతి కదలికను పక్కా ప్లాన్ తో పేపర్ పై రాసుకుని స్క్రీన్ ప్లే రాసుకుని చిత్రీకరించేందుకు రెడీ అయ్యాం. ఈ సీన్ షూటింగ్ కు ఒరిజినల్ లొకేషన్ కావాలని నిర్మాత అశ్వినీదత్ గారితో అన్నాను. చిరంజీవి వంటి పెద్ద స్టార్ హీరోతో ఒరిజినల్ రైల్వే స్టేషన్ లో షూటింగ్ ఎలా అంటూ అవాక్కయ్యారు. నేను పట్టుబట్టడంతో నాంపల్లి.. కాచిగూడ రైల్వే స్టేషన్స్ లో షూటింగ్ ఏర్పాటు చేశారు. ఒక రోజు నాంపల్లి.. మరోరోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో షూటింగ్ చేశాం. రెండు రోజులు రైల్వే స్టేషన్లో జనాలను కంట్రోల్ చేయడానికి అశ్వినీదత్ గారు కర్రపట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఆ షూటింగ్ కారణంగా ఎంతో మంది వాళ్లు ఎక్కాల్సిన రైలు మిస్ చేసుకున్నారు. ఎంతో కష్టపడ్డాం అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చింది.” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ గుణశేఖర్.
