Happy Birthday Superstar krishna: తెలుగు సినిమా చరిత్ర తనదైన ముద్రవేసిన హీరో ఆయన.. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు.. తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన నటుడు. తెలుగు సినిమాలు కొత్త రంగులను అద్దిన హీరో.. తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించిన డైనమిక్ హీరో.. ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ. నేడు ఘట్టమనేని కృష్ణ పుట్టిన రోజు. సూపర్ స్టార్ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. మరెన్నో అనుభవాలు. ఓ చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. 1942 సంవత్సరం మే 31న ఘట్టమనేని కృష్ణ జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించే అవకాశం దక్కింది. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) ఇదంతా కృష్ణ ఘనతే.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు కృష్ణ. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు అందించారు. కృష్ణ నటించిన మూడవ సినిమా గూఢచారి 116 . కృష్ణ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేశారట. దీని బట్టే అర్ధమవుతుంది ఆయనకు సినిమా అంటే ఎంత మక్కువో.. రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు కృష్ణ. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :