
అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీతో పాటు తెలుగు సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందామె.అయితే అక్షయ్ తో పెళ్లి, పిల్లల తర్వాత రచయితగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై గొంతెత్తుతోంది. అలా తాజాగా సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనపై ట్వింకిల్ ఖన్నా స్పందించింది. కాగా ఈ దాడికి కరీనా కపూర్ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు కరీనా కపూర్ తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వీటిని ట్వింకిల్ ఖన్నా ఖండించింది. ‘సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక పుకారు వ్యాపించింది. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు కరీనా సహాయం చేయలేదని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ వదంతులు మాత్రం ఆగలేదు. మహిళ అందులోనూ ఒక వ్యక్తి భార్యపై నిందలు రావడంతో ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారు. అదే విధంగా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన సతీమణి అనుష్క శర్మను నిందిస్తుంటారు. సెలబ్రిటీల విషయంలోనే కాదు సామాన్యుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. భర్తల సమస్యలకు భార్యలను నిందించడం ఏ మాత్రం సరికాదు’ అని ట్వింకిల్ ఖన్నా అభిప్రాయపడింది.
కాగా జనవరి 16న నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండుగుడు నటుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ శరీరంపై చాలా చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్ ను సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులు చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నాడు సైఫ్.
కాగా నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. అరెస్టయిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడనేది ముఖ్యమైన సమాచారం. అతను కొన్ని రోజులు కోల్‌కతాలో ఉన్నాడు కాబట్టి అతనికి ఎవరు సహాయం చేసారు లేదా అతనితో ఈ దాడిలో ఎవరైనా ఉన్నారా? అనే అనేక ప్రశ్నలకు ముంబై పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.