Raghava Reddy Review: రాఘవ రెడ్డి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

సంక్రాంతికి పెద్ద సినిమాలు క్యూ కట్టడంతో ముందు వారమే చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. అలా జనవరి 5న విడుదలైన చిత్రం రాఘవ రెడ్డి. సీనియర్ హీరోయిన్ రాశీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా ఇది. శివ కంఠంనేని హీరోగా సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

Raghava Reddy Review: రాఘవ రెడ్డి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Raghava Reddy

Edited By:

Updated on: Jan 05, 2024 | 6:39 PM

మూవీ రివ్యూ: రాఘవ రెడ్డి

నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ తదితరులు

సంగీతం: సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో

సినిమాటోగ్రఫీ: S. N. హరీష్

ఎడిటింగ్: ఆవుల వెంకటేష్

నిర్మాతలు: K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు

దర్శకుడు : సంజీవ్ మేగోటి

సంక్రాంతికి పెద్ద సినిమాలు క్యూ కట్టడంతో ముందు వారమే చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. అలా జనవరి 5న విడుదలైన చిత్రం రాఘవ రెడ్డి. సీనియర్ హీరోయిన్ రాశీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా ఇది. శివ కంఠంనేని హీరోగా సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:

రాఘవ రెడ్డి (శివ కంఠంనేని) ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తుంటాడు. కొన్ని కష్టమైన కేసులను ఆయన తన తెలివి తేటలతో సాల్వ్ చేస్తుంటాడు. ప్రొఫెసర్ అయినా కూడా కేసులు సాల్వ్ చేస్తూ పోలీసులకు అండగా నిలుస్తుంటాడు రాఘవ రెడ్డి. అలా ఆయన పని చేసే కాలేజ్‌లోకి లక్కీ (నందితా శ్వేత) స్టూడెంట్‌గా వస్తుంది. వచ్చీ రావడంతోనే ఆటిట్యూడ్ చూపించడమే కాదు.. తన బిహేవియర్‌తో అందరికీ చిరాకు తెప్పిస్తుంది. కాలేజ్ మొత్తం భయపడే రాఘవ రెడ్డిని చూసి కూడా లక్కీ అస్సలు లెక్క చేయదు. రౌడీ బేబీలా ఉంటుంది. ఈ క్రమంలోనే రాఘవ రెడ్డికి, లక్కీకి అస్సలు పడదు. ఓ సమయంలో ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్తుంది వ్యవహారం. ఇంతలో దేవకీ (రాశీ) కనిపిస్తుంది. ఆమెని చూస్తేనే భయపడుతుంటాడు రాఘవ రెడ్డి. కాలేజ్ అంతా భయపడే రాఘవ రెడ్డి.. ఎందుకు దేవకిని చూడగానే భయపడుతుంటాడు.. పరిగెడుతుంటాడు..? సీన్ కట్ చేస్తే స్టూడెంట్ అయిన లక్కీని ఎవరు కిడ్నాప్ చేసారు..? తన బిడ్డని కాపాడాలని, మూడే రోజుల్లో తన కూతురు తన దగ్గర ఉండాలని చెప్తుంది దేవకి. అసలు రాఘవరెడ్డిని దేవకి ఎందుకు సవాల్‌ చేస్తుంది..? ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి..? అసలు లక్కీ ఎవరు అనేది అసలు కథ..

కథనం:

ఈ రోజుల్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్లే కొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే ప్రమోషన్ చేసుకోలేక కొన్నిసార్లు కొత్త ప్రయత్నాలు కూడా కనిపించకుండానే పోతుంటాయి. తాజాగా రాఘవ రెడ్డి అనే సినిమా కూడా ఇలాంటి ప్రయత్నమే చేసారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తోనే ఈ సినిమా కూడా వచ్చింది. కాకపోతే రొటీన్ రెగ్యులర్ సినిమాలా కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు సంజీవ్ మేగోటి. కొత్త సీసాలో కాస్త కమర్షియల్‌ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అంతా రాఘవ రెడ్డి కారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు. కాలేజ్ ఎపిసోడ్స్, నందితా శ్వేతా, హీరో మధ్య వచ్చే సీన్స్‌తోనే ఫస్టాఫ్ అల్లుకున్నాడు. మరోవైపు హీరో కారెక్టరైజేషన్ మీద ఫోకస్ చేసాడు దర్శకుడు. ఆయన ఎంత స్టిక్ట్ ప్రొఫేసర్‌ అని, అదే సమయంలో ఎంతటి క్లిష్టమైన కేసులను అయినా ఇట్టే ఎలా సాల్వ్ చేయగలడనేది చూపించాడు. ముఖ్యంగా హీరో కొత్త వాడే అయినా కూడా ఎలివేషన్స్ బాగానే ఇచ్చారు. ఓ వైపు హీరో పాత్ర అటు కేసులను సాల్వ్ చేయడంతో పాటు మరోవైపు కాలేజ్ ప్రొఫెసర్‌గానూ ఉండటం అనేది బాగానే చూపించారు. నందిత శ్వేత సీన్స్.. ఆమె పక్కనే ఉండే శ్రీనివాస్‌ రెడ్డి చేసే కామెడీ పర్లేదనిపిస్తుంది. ఇలాగే ఫస్టాఫ్ అంతా అయిపోతుంది. కీలకమైన సెకండాఫ్‌లో అసలు రాఘవ రెడ్డి ఎవరు.. రాశీతో ఆయనకేంటి సంబంధం అనేది చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అక్కడి వరకు కాలేజ్, కేసులు అంటూ తిరిగిన కథ ఒక్కసారిగా ఫ్యామిలీ టర్న్ తీసుకుంటుంది. ఎమోషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేసాడు. రాఘవరెడ్డి ప్లాష్‌ బ్యాక్‌లో భార్యతో గొడవ.. కుటుంబానికి దూరం అవ్వడం ఇవన్నీ చూపించారు. అదే సమయంలో కూతురుని చూడాలని పడే తపన, బాధ ఎమోషనల్‌గా పర్లేదు అనిపిస్తుంది. అయితే కథ బాగానే ఉన్నా.. కథనంలోనే అసలు లోపాలున్నాయి. చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే రాఘవ రెడ్డి సినిమాకు మైనస్. సీరియల్‌లా నెమ్మదిగా వెళ్లడంతో స్లో అయిపోతుంది సినిమా. కొత్త దర్శకుడు కాబట్టి అక్కడే అతడి అనుభవ లేమి కనిపిస్తుంది. డ్రామా కూడా అక్కడక్కడా ఓవర్‌ అనిపిస్తుంది. నందిత శ్వేత కిడ్నాప్‌ ఎపిసోడ్‌ సైతం అంతగా ఆకట్టుకోదేు. అయితే చివర్లో ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌తో పిండేస్తూ ముగించడం మంచి ఫీల్ ఇస్తుంది.

నటీనటులు:

రాఘవ రెడ్డి పాత్రలో శివ కంఠంనేని బాగా నటించాడు. కొత్త నటుడు అనే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్‌లో చాలా బాగా నటించాడు. తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగానే నటించాడు. ఎమోషనల్‌ సీన్లు, సెంటిమెంట్‌ సీన్లలో మెప్పించాడు. ఇక చాలా రోజుల తర్వాత సీనియర్ నటి రాశీ స్క్రీన్ మీద కనిపించింది. ఆమె సహజమైన నటన సినిమాకు ప్లస్. లక్కీ పాత్రలో నందిత శ్వేత ఓకే. మిగిలిన వాళ్లంతా బాగానే ఉన్నారు.. పరిధి మేర నటించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంజీవ్‌ మేగోటి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించాడు. ఆయనతో పాటు సుధాకర్ మారియో ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. అది జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది. ఎడిటింగ్ నెమ్మదిగా ఉంది. దర్శకుడి ఛాయిస్ కాబట్టి నో కామెంట్స్. దర్శకుడు సంజీవ్ మేగోటి కథ బాగానే రాసుకున్నాడు కానీ కథనం దగ్గర తడబడ్డాడు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న దర్శకుడు అయితే ఇదే కథను మరింత మెరుగ్గా తీసేవాడు అనిపిస్తుంది.

పంచ్ లైన్:

రాఘవ రెడ్డి.. రొటీన్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి