
దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటీమణుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. నటిగా ఇప్పటికీ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు రాధికా శరత్ కుమార్. 1962 ఆగస్టు 21న చెన్నైలో ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ, గీతా దంపతులకు రాధికా జన్మించారు. రాధికకు నిరోష అనే చెల్లెలుతో పాటు పలువురు సవతి సోదరులు, సోదరీమణులు ఉన్నారు. రాధికా సినీ ప్రయాణం చాలా చిత్రంగా మొదలైంది. లండన్‌లో చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరం సెలవులకి చెన్నై వచ్చిన రాధికను దర్శకుడు భారతీరాజా చూశారట. ఆ సమయంలో ఆయన కిళక్కు పోగుం రైల్ అనే సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారు. రాధికకు నటన పట్ల ఆసక్తి లేకపోయినా, ఆమె తండ్రి ఎం.ఆర్. రాధ అనారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె తల్లి సినిమాకు అంగీకరించక తప్పలేదు. రాధిక తనకు యాక్టింగ్ రాదని, హీరోయిన్‌గా తాను సరిపోనని భావించినా, భారతీరాజా ఆమెను ఒప్పించి సినిమాలోకి తీసుకున్నారు.
1978లో విడుదలైన కిళక్కు పోగుం రైల్ షూటింగ్ సమయంలో రాధికకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయడంపై సెట్‌లో చాలామంది ఎగతాళి చేశారట. ఒక డాన్స్ సన్నివేశంలో కొరియోగ్రాఫర్ ఆమెను కొట్టడంతో, అవమానభారంతో షూటింగ్ వదిలి వెళ్ళిపోవాలనుకున్నారట. అయితే, నిర్మాత జోక్యం చేసుకుని ఆమెను బుజ్జగించారట. ఈ సవాళ్ళ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అఖండ విజయం సాధించింది, 365 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయం రాధికలోని నటిని బయటకు తీసుకొచ్చింది. ఇదే చిత్రాన్ని బాపు తెలుగులో తూర్పు వెళ్ళే రైలు పేరుతో రీమేక్ చేశారు. తర్వాత రాధికకు అవకాశాలు వెల్లువెత్తాయి. 1979లో ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో ఆమె అడుగుపెట్టిన తొలి చిత్రం న్యాయం కావాలి (1981). చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆమెకు అద్భుతమైన పాత్ర దక్కింది. షూటింగ్ సమయంలో తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో కొంత గందరగోళం చెలరేగినా, యూనిట్ సభ్యుల సహకారంతో ఆమె అద్భుతంగా నటించారు. న్యాయం కావాలి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి, ఆమెకు ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ నటులైన కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, సుమన్, కమల్ హాసన్, రజినీకాంత్, శరత్ కుమార్ వంటి వారితో కలిసి నటించారు.
రాధిక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 1985లో ప్రతాప్ పోతెన్‌ను వివాహం చేసుకుని, ఒక సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. 1990లో రిచర్డ్ హార్డీని వివాహం చేసుకున్నారు, 1992లో వారికి కూతురు రియాన్నే జన్మించింది. కుమార్తె పుట్టిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పుడు సినిమాలకు దూరం కావాలనుకున్న రాధికను, భారతీరాజా కిళక్కు చీమయిలే చిత్రంలో నటించడానికి ఒప్పించారు. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది, తెలుగులో పల్నాటి పౌరుషంగా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో రాధికా శరత్ కుమార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే అభివృద్ధి చెందుతున్న టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, తన కూతురు పేరు వచ్చేలా రాడాన్ మీడియావర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా చిట్టి వంటి ఎన్నో విజయవంతమైన సీరియల్స్‌ను నిర్మించారు, అవి తెలుగులో కూడా డబ్ అయ్యి ప్రజాదరణ పొందాయి. ఇది ఆమె కెరీర్‌కు కొత్త మలుపునిచ్చింది.
తర్వాత సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించడం ప్రారంభించారు. సౌందర్య తల్లిగా ఆరో ప్రాణం(1997), శరత్ కుమార్‌కు భార్యగా, చిన్న శరత్ కుమార్‌కు తల్లిగా సూర్యవంశం వంటి చిత్రాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రేమకథ చిత్రంలో సుమంత్ తల్లిగా నటనకు నంది అవార్డును గెలుచుకున్నారు. 2001లో నటుడు శరత్ కుమార్‌ను వివాహం చేసుకుని, 2004లో రాహుల్ అనే కుమారుడికి జన్మనిచ్చారు.రాధికా శరత్ కుమార్ తన కెరీర్‌లో 280కు పైగా సినిమాలు అనేక సీరియల్స్‌లో నటించారు. ఒక నేషనల్ అవార్డు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 2 నంది అవార్డులు, సైమా అవార్డులతో సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇక రాధికా అలనాటి హీరోల దగ్గర నుంచి నేటి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించారు మూడు తరాల హీరోలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రాధికా. ఇటీవలే సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో మరోసారి రాధికా తన నటనతో ఆకట్టుకున్నారు. 63 ఏళ్ల వయసులోనూ అదే చలాకీ తనం, అదే అందంతో మారుతున్న కాలానికి తగ్గట్టుగా తన కెరీర్‌ను మలచుకున్న తీరు, ఆమెను ఇప్పటికీ పరిశ్రమలో నిలబెట్టాయి. రాధికా శరత్ కుమార్ జీవితం ఎందరికో ఆదర్శం అనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.