టాలెంటెడ్ హీరో ఆర్ మాధవన్(R. Madhavan).. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. మాధవన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్స్ అయ్యాయి. తాజాగా మాధవన్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆర్.మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . హీరోగా నటిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భముగా మాధవన్ మాట్లాడుతూ.. నంబి నారాయణన్ సాధించిన విజయాలను గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. కానీ ఆయనెప్పుడూ వాటి గురించి బయటకు చెప్పుకోలేదు. నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
నిజానికి రెండు రకాలైన దేశ భక్తులుంటారని నాకు అప్పుడే తెలిసింది. ఒకరేమో దేశం సరిహద్దుల్లో ఉంటూ శత్రువుల బుల్లెట్స్‌కువ ఎదురెళ్లి ప్రాణ త్యాగం చేస్తుంటారు. వారికెప్పుడూ మనం రుణ పడి ఉంటాం. మరొకరు వారి జీవితాన్ని విధి నిర్వహణ కోసమే కేటాయిస్తుంటారు. తమ కుటుంబం గురించి కూడా పట్టించుకోరు. వారికెలాంటి గుర్తింపు కూడా ఉండదు. కానీ వారు చాలా ప్యాషన్‌తో తన డ్యూటీ చేస్తుంటారు. అప్పుడే సినిమా చేయాలని అనుకున్నారు. ఏడాదిన్నర పాటు కథను తయారు చేశాను. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కొని పరిస్థితులను నంబి నారాయణన్ గారు ఫేస్ చేశారు. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినీ ఇండస్ట్రీలో స్వాతంత్య్ర వీరులపై, పౌరాణిక పాత్రలపై ఇలా చాలా వాటిపై సినిమాలు తీస్తుంటాం. కానీ వీటికి సంబంధం లేకుండా సైన్స్, టెక్నాలజీ అనే రంగంలో చాలా మంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే కారణంగా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా చేశాను. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలకు మన దేశానికి చెందిన ఇంజనీర్స్ సి.ఇ.ఓలుగా పని చేస్తున్నారు. చాలా మంది ఇండియాలో లేరు. అలాంటి వారందరూ మన దేశానికి తిరిగి రావాలి.
‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ మూవీ చేయడానికి ఆరేళ్ల సమయం తీసుకున్నాను. ఎవరూ చూపించని కొత్త విషయాలను చూపించబోతున్నాం. సాధారణంగా రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూసుంటాం. కానీ ఏ సినిమాలో రాకెట్ ఇంజన్‌ను చూపించి ఉండరు. కానీ తొలిసారి ఆ రాకెట్ ఇంజన్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమాలో ప్రాస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌గారిలా కనిపించటానికి నా దంతాల అమరికను మార్చాను. అలాగే బరువు పెరిగాను, తగ్గాను. బాహుబలి వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో మా టీమ్ కూడా అంతే కష్టపడ్డారు’’ అని తెలిపారు.