Pushpa 2: జపాన్‌లోనూ పుష్ప రూలింగ్.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తూ టాప్–10లోకి పుష్ప2
ఆయన నడకలో ఒక మేనరిజం ఉంటుంది.. ఆయన మాటలో ఒక పవర్ ఉంటుంది. ఇప్పటికే భారతదేశం మొత్తం ‘తగ్గేదే లే’ అంటూ తన మాయలో పడేలా చేసుకున్న ఆ హీరో.. ఇప్పుడు దేశం దాటి ఖండాంతరాలు దాటి వెళ్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లర్‌గా బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ‘పుష్ప’రాజు.. ఇప్పుడు జపాన్ దేశంపై కన్నేశాడు.

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి ఊపును కొనసాగిస్తోంది. అక్కడి భాషలో డైలాగులు చెబుతూ, అక్కడి ప్రేక్షకులను తన గ్యాంగ్‌లో కలిపేసుకుంటున్న ఆ హీరో ఎవరో మనందరికీ తెలుసు. మరి జపాన్ గడ్డపై ఈ మెగా హీరో సాధించిన లేటెస్ట్ రికార్డులేంటి? అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా ఎక్కడ ఉంది?
జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ ప్రభంజనం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది జనవరి 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. కేవలం 14 రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఈ సినిమా జపాన్‌లో ¥105 మిలియన్లు (సుమారు రూ. 6.1 కోట్లు) వసూలు చేసింది. ఈ వసూళ్లతో జపాన్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలోకి పుష్ప 2 చేరిపోయింది.
అమీర్ ఖాన్ రికార్డు బ్రేక్..
జపాన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్ 3’ పదో స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును అధిగమించి టాప్-10లో చోటు దక్కించుకుంది. జపాన్ వంటి మార్కెట్లలో భారతీయ సినిమాలు రాణించడం అంత సులభం కాదు. కానీ అల్లు అర్జున్ కు అక్కడ ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అద్భుతమైన నంబర్స్ నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ¥2.42 బిలియన్లతో మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి 2, సాహో, మగధీర వంటి సినిమాలు కూడా టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఆ ఎలైట్ క్లబ్ లో చేరడం విశేషం.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి జపాన్ వెళ్లారు. టోక్యోలో జరిగిన ఈవెంట్‌లో రష్మిక మందన్నతో కలిసి సందడి చేశారు. అక్కడ తన పాపులర్ డైలాగులను జపనీస్ భాషలో చెప్పి అక్కడి అభిమానులను ఫిదా చేశారు. అల్లు అర్జున్ స్టైల్, సుకుమార్ మేకింగ్ జపాన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. 250కి పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా.. ఆ దేశంలోని ప్రధాన నగరాలైన టోక్యో, ఒసాకాలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ సునామీ..
ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1871 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జపాన్ వసూళ్లు కూడా తోడవడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. హిందీ బెల్ట్ లో ఇప్పటికే రూ. 800 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక భారతీయ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.
ఈ సినిమా చివర్లో ‘పుష్ప 3: ది రాంపేజ్’ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో.. పార్ట్-3 కోసం ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఒక ప్రాంతీయ కథతో మొదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం అల్లు అర్జున్ కే సాధ్యమైంది. జపాన్ లో ఇప్పుడు జరుగుతున్న ఈ ‘రాంపేజ్’ చూస్తుంటే రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
