Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piracy: పైరసీతో ఇండియన్ సినిమాకు రూ.22,400 కోట్ల నష్టం

చిన్న పాము కాదు.. పెద్ద అనకొండ. ఇప్పటికే సగం మింగేసింది. ఇప్పుడు కొనఊపిరితో ఉన్నా వదిలిపెట్టడం లేదు. ఔను.. పైరసీ భూతం గురించే మనం చెప్పుకునేది. అసలే సినిమా కష్టాలు చుట్టుముట్టి చితికిపోతున్న ఇండస్ట్రీని జీరో సైజుకు పడగొడుతూ క్యాన్సర్‌ పుండులా ముదురుతోంది. ఇంకానా ఇకపై చెల్లదు అంటూ పైరసీపై పెద్ద యుద్ధమే ప్రకటిస్తున్నారు పరిశ్రమ పెద్దలు. ఇలా ఉలిక్కిపడి మేలుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాకపోయినాఇప్పుడు మాత్రం విషయం చాలా సీరియస్ అవుతోంది.

Piracy: పైరసీతో ఇండియన్ సినిమాకు రూ.22,400 కోట్ల నష్టం
Piracy
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2025 | 7:37 PM

Share

ఏటా పైరసీ కాటుకు 22 వేల కోట్ల మేర దెబ్బయిపోతున్న ఇండియన్ సినిమా.. నెలకు 40 వేలొస్తాయని కక్కుర్తి పడి వందల కోట్ల సినిమాను బలితీసుకుంటారా..? ఊరూరా సీక్రెట్ కెమెరాలతో మాటువేసిన పైరసీగాళ్లు, వాళ్లతో కుమ్మక్కయ్యే థియేటర్ల యాజమానులు.. సినిమా పరిశ్రమను పీడించే పైరసీ క్యాన్సర్‌కు కారణం ఇంటిదొంగలేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

థియేటర్లో మార్నింగ్‌ షో పడగానే.. మన హోమ్‌ థియేటర్లో మ్యాట్నీ షో రెడీ ఔతోంది. సేమ్ మూవీ, సేమ్ క్వాలిటీ.. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టిక్కెట్ ప్రైస్‌తో సంబంధం లేదు. బుకింగ్ కోసం క్యూలైన్లో నిలబడేది లేదు. ఆన్లైన్‌లో ఎవైలబులిటీ చూసే ప్రయాసా లేదు. అర్థరూపాయి ఖర్చు లేకుండా కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్న వాళ్లు మన మధ్యలోనే కోకొల్లలు.

చూసేవాళ్లకు మిగిలేది రెండొందలో మూడొందలో అంతకుమించి ఉండదు. తీసేవాళ్లకు మాత్రం కోట్లల్లో నష్టం. మొత్తం ఇరవైనాలుగు విభాగాల్లో ఎక్స్‌పర్ట్స్‌ తమ మేథస్సును పెట్టుబడిగా పెట్టి అత్యంత శ్రమకోర్చి ఒక సినిమా తీస్తే… అది కాస్తా పైరసీగాళ్ల చేతివాటానికి దొరికి.. టోటల్‌గా సినిమా పరిశ్రమకే దెబ్బయిపోతోంది. జానా కిరణ్ కుమార్… ఒకేఒక్కడు.. 50కి పైగా సినిమాల్ని దొంగిలించి పైరసీ వెబ్‌సైట్లకు అమ్మిపారేశాడు. ఇటీవలే ఈ చోరగాడ్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు.. విచారణలో దిమ్మదిరిగే విషయాలు తెలిసొచ్చాయి.

హ్యాష్‌ ట్యాగ్ సింగిల్ అనే సినిమా HD ప్రింట్… రిలీజ్ రోజు మధ్యాహ్నానికే తమిళ్‌బ్లాస్టర్స్, మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ.. మూడు పైరసీ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చింది. వెంటనే అలర్టయిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ ఛాంబర్లోని యాంటీ పైరసీ సెల్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ పోలీసులు చాకచక్యంగా కదిలారు.

అత్తాపూర్లోని సినీ పోలిస్‌లో మ్యాట్నీ షోకు టికెట్ బుక్ చేసుకున్న కిరణ్‌పై అనుమానం వచ్చి ఫోన్ చేయగా… స్విచాఫ్ చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి, లొకేషన్ మార్చడం అతడికున్న అలవాటే. ఈసారి మాత్రం ఇంటి లొకేషన్‌ను గుర్తించి పక్కా ప్లానింగ్‌తో వేటాడి తనిఖీ చేసిన పైరసీ సెల్ సిబ్బంది.. కిరణ్‌ను అదుపులోకి తీసుకుంది. అతడి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌కు పంపి.. వాటర్‌మార్కింగ్‌ను పరిశీలిస్త.. ఇది ఏ ఫలానా థియేటర్ నుంచి లీకైన కంటెంట్ అని తేలిపోయింది.

మూడు రోజులపాటు కిరణ్ కుమార్‌ను విచారించిన పోలీసులు… ఇతడు 2019 నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్టు, ఇప్పటి వరకు 65 సినిమాల కంటెంట్‌ను చోరీ చేసినట్టు గుర్తించారు. పైరసీ సైట్ల నుంచి ఒక్కో సినిమాకు నెలకు 40 నుంచి 80 వేల దాకా వెనకేసుకునేవాడు. ఆ పేమెంట్లు కూడా సందేహం రాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగేవి. ఫైరసీ చేసిన సినిమాల లింకుల్ని మొదట టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేసి… అక్కడ్నుంచి వెబ్‌సైట్లకు చేరవేస్తాడు. ఇలా.. తండేల్, పెళ్లికాని ప్రసాద్, 14డేస్ లవ్, గేమ్ ఆన్, కిస్మత్, రాజధాని ఫైల్స్… ఇలా డజన్ల కొద్దీ సినిమాలు వీడి చేతికి దొరికి ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాయి. పైరసీ కారణంగా ఇండ్రస్ట్రీకి 3 వేల 700 కోట్లు నష్టం వచ్చిందన్నది తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన ప్రాధమిక అంచనా.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఐమా.. ది రాబ్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదికనే ఇచ్చింది. దీని ప్రకారం.. పైరసీ కారణంగా ఏటా ఇండియన్ సినిమా 22 వేల 400 కోట్లు నష్టపోతోంది. 51 శాతం మంది ప్రేక్షకులు పైరేటెడ్ కంటెంట్‌నే ఆశ్రయిస్తున్నారట. ఈవిధంగా ఇండియన్ సినిమా ఉనికినే ప్రశ్నిస్తున్న పైరసీ వెబ్‌సైట్లపై ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఛాంబర్‌లోని యాంటీ పైరసీ సెల్ చొరవతో కిరణ్ పట్టుబడ్డాడు. ఇతగాడు పాల్పడే పైరసీ ఒక శాంపిల్ మాత్రమే. కానీ… కేబుల్ టీవీల ద్వారా జరిగే పైరసీ, సినిమా రిలీజ్‌కు ముందే ప్రింట్లను దొంగిలించి చేసే పైరసీ.. ఇలా పైరసీ కళ అనేక రకాలుగా కొనసాగుతోంది.

ఇంతకంటే విచిత్రం ఏంటంటే… కొన్నిచోట్ల థియేటర్ యాజమాన్యాలు సైతం పైరసీగాళ్లతో డీల్ కుదుర్చుకోవడం. పుష్ప2, కల్కి లాంటి భారీ సినిమాలే కాదు.. సింగిల్ లాంటి చిన్నచిన్న సినిమాల్ని సైతం వదలడం లేదు పైరసీగాళ్లు.

పైరసీ జాడ్యాన్ని అడ్డుకోడానికి పరిశ్రమలో ఎవరికివాళ్లు సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజమౌళి తీసే బడా సినిమాల రిలీజప్పుడు గాని… గీతా ఆర్ట్స్‌ లాంటి బిగ్గెస్ట్ బ్యానర్ల నుంచి సినిమాలు వస్తున్నప్పుడు గానీ పైరసీగాళ్లపై ఓ కన్నేసే ఉంచుతారు నిర్మాతలు. ఈ విధంగా దాదాపు 100 లింకులదాకా డిలీట్ చేయించారు. ఐనా.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మళ్లీ పైరసీకి ఎవరూ పాల్పడకుండా జడుసుకునేలా కఠిన శిక్షలు పడితే తప్ప ఈ రోగం నయమయ్యేలా లేదు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వెబ్‌సైట్లను, యూట్యూబ్ ఛానెళ్లను క్షణాల మీద బ్లాక్ చేయించింది ప్రభుత్వం. సినిమా పైరసీపై కూడా అటువంటి యుద్ధప్రాతిపదిక చర్యే తీసుకోవాల్సిన అవసరముంది.

దేశవ్యాప్తంగా ఫిలిమ్ ఛాంబర్లన్నీ ఏకమై… టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు అందరు సినీ పెద్దలూ ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ సిట్యువేషన్‌ వచ్చేసిందా? కరోనా దాడితో మొన్న, ఓటీటీ ఒరవడితో, వరుస డిజాస్టర్లతో ఇప్పుడు కునారిల్లిపోతున్న సినిమా పరిశ్రమకు పైరసీ అనేది నిరంతర గండంగా మారింది.