అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చంచల్‌గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్.. ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్లలో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు అల్లు అయాన్‌ను హత్తుకుని వదల్లేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులందర్నీ కలిశారు.
ఇంట్లోకి ప్రవేశించకముందే ఆయనకు దిష్టితీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూడడం.. దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్‌డేట్స్ కోసమే వేచిచూడడం వల్ల.. దిష్టితగిలి ఉండొచ్చని.. ఆయనకు కుటుంబ సభ్యులు దిష్టితీశారు. అనంతరం హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు.
ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్‌అప్ అయిన బన్నీ.. తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందర్నీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా వచ్చారు. ఆతర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లికూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాస్, అంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందర్నీ దగ్గరుండి పలకరించిన బన్నీ.. వారితో చాలాసేపు ముచ్చటించారు.
తన మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గర తీసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అన్న అల్లు అరవింద్‌తోపాటు, అల్లు అర్జున్‌కి ధైర్యం చెప్పారు సురేఖ.
జైలు నుంచి బయటకు వచ్చాక.. ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. రెండు సార్లు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా.. ఎలాంటి ఘటన జరగలేదని.. ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా.. తనకు తెలియకుండా జరిగిందే అన్నారు. ఆ కుటుంబానికి సారీ చెప్పి.. అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
12 గంటల పాటు చంచల్‌గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్.. ఉదయం 6గంటల 39 నిమిషాలకు బయటకు వచ్చారు. రాత్రి మంజీరా బ్యారక్‌లోని బ్లాక్-1లో అల్లు అర్జున్‌ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు కాని అలా జరగలేదు. బన్నీకి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ UT7697 నెంబర్‌ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో మంజీరా బ్యారక్‌లో స్పెషల్ VIP సెల్ ఇచ్చారు. జైలు అధికారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు బన్నీ. తనను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. ఆర్డర్ కాపీ రాగానే విడుదల చేస్తామన్నారు. రాత్రి అల్లు అర్జున్‌కి భోజనం అందించినా ముందు తినలేదు. ఆ తర్వాత పప్పు అన్నం కాస్త తీసుకున్నారు. పడుకునేందుకు రగ్గు, దుప్పటి ఇచ్చినా.. ఆయన రాత్రి 2 గంటల వరకు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగి నేలపై రగ్గు వేసుకుని నిద్రపోయారు. ఉదయం 5:45కి బన్నీని నిద్ర లేపారు జైలు అధికారులు.. ఆ తర్వాత విడుదల కార్యక్రమాలు పూర్తి చేశారు. 6గంటల 39 నిమిషాలకు బయటకు వచ్చారు. మెయిన్‌గేటు నుంచి బయటకు వచ్చినా.. ఎస్కార్ట్ వాహనాలతో ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి ఉదయం 7గంటలకు జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు బన్నీ. 9 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు.
శుక్రవారం నుంచి జైల్లోకి వెళ్లేవరకు.. తిరిగి ఉదయం జైలు దగ్గర్నుంచి.. ఇంటికి వచ్చి అందర్నీ పలకరించేవరకు తండ్రి అల్లు అరవింద్, బన్నీ వెన్నంటే ఉన్నారు. రాత్రి క్యాబ్ బుక్‌చేసుకుని ఇంటికి వెళ్లిన అరవింద్.. ఎంతో టెన్షన్‌తో కనిపించారు. ఉదయం విడుదల తర్వాత ఆయన ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తమ కుటుంబానికి వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్.
ఐకాన్ స్టార్ లైఫ్‌లో ఒక కఠినమైన రోజు