Darling Movie: డార్లింగ్ మూవీ రివ్యూ.. నభనటేష్ మూవీ ఎలా ఉందంటే..

| Edited By: Rajeev Rayala

Jul 19, 2024 | 11:18 AM

మల్లేశం, బలగం లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. హీరోగా ఫస్ట్ టైమ్ ఓ కమర్షియల్ సినిమా చేసాడు. మరోవైపు యాక్సిడెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నభా నటేష్ కూడా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ జోడీ ఆడియన్స్ మనసులు గెలుచుకుందా.. డార్లింగ్ సినిమా ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

Darling Movie: డార్లింగ్ మూవీ రివ్యూ.. నభనటేష్ మూవీ ఎలా ఉందంటే..
Darling
Follow us on

మూవీ రివ్యూ: డార్లింగ్

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ళ, కృష్ణ తేజ్, బ్రహ్మానందం, విష్ణు, మురళీధర్ గౌడ్ తదితరులు

ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్

సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాతలు: చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అశ్విన్ రామ్

మల్లేశం, బలగం లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. హీరోగా ఫస్ట్ టైమ్ ఓ కమర్షియల్ సినిమా చేసాడు. మరోవైపు యాక్సిడెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నభా నటేష్ కూడా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ జోడీ ఆడియన్స్ మనసులు గెలుచుకుందా.. డార్లింగ్ సినిమా ఎలా ఉంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రాఘవ్ (ప్రియదర్శి) కు చిన్నప్పట్నుంచి ఒకటే ఆశ ఉంటుంది. బాగా చదువుకుని.. సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకుని.. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం పారిస్ వెళ్లాలి. తన కాలనీలో చిన్నపుడు ఓ టీచర్‌ను (సుహాస్) చూసి ఈ నిర్ణయం తీసుకుంటాడు రాఘవ్. దానికోసమే కలలు కంటుంటాడు. అలాంటి రాఘవ్‌కు ఓసారి సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ళ)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ చివరి నిమిషంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దాంతో అందరూ రాఘవ్‌ను చూసి వెక్కిరిస్తారు. ఆ సమయంలో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు రాఘవ్. అప్పుడు అతడి ఆలోచనలు మార్చి.. చచ్చిపోకుండా ఆపుతుంది ఆనంది (నభా నటేష్). పరిచయం అయిన మూడు నాలుగు గంటల్లోనే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి అయిన మొదటి రాత్రే ఆనందిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆమెలోని ఆది అనే మరో వ్యక్తి బయటికి వచ్చి రాఘవ్‌ను ఇష్టమొచ్చినట్లు కొడుతుంది. అప్పట్నుంచి ఎప్పుడు భార్యను ముట్టుకోవాలని ప్రయత్నించినా అదే జరుగుతుంది. ఆమె సమస్య తెలుసుకుని సాల్వ్ చేసిన తర్వాత.. ఓసారి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది ఆనంది. కానీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది. అప్పుడే తెలుస్తుంది.. తన భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు.. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని.. ఆమెలో కేవలం ఆది మాత్రమే కాదు ఝాన్సీ, పాప, మాయ ఇలా మరో నలుగురు కూడా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది..? వాళ్లందరినీ ఆనంది బాడీ నుంచి రాఘవ్ ఎలా బయటికి పంపించాడు అనేది అసలు కథ..

కథనం:

కొన్నిసార్లు కథను కన్ఫ్యూజన్ డామినేట్ చేస్తుంటుంది. డార్లింగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. కథ క్లారిటీగానే రాసుకున్నా.. స్క్రీన్ ప్లేతో సినిమా ఎటెటో వెళ్లిపోయింది.. మొదలవ్వడం బాగానే ఉన్నా.. పోను పోను ఎటు పోతుందో అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ పరాకాష్టకు చేరిపోయి.. ఓ టైమ్‌లో ఏ సీన్ ఎందుకొస్తుందో కూడా అర్థం కాకుండా తయారైంది కథ. సమాజంలో అమ్మాయి ఫేస్ చేస్తున్న సమస్యల గురించి చెప్పాలనుకున్నాడు దర్శకుడు అశ్విన్ రామ్. దానికోసమే హీరోయిన్‌కు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ పెట్టాడని అర్థమవుతుంది. కానీ ఆమెకు ఎందుకు అలాంటి సమస్య వచ్చిందో క్లారిటీగా చెప్పలేకపోయాడు. సీరియస్ సీన్స్ కూడా కామెడీ చేసి.. కథను కలగాపులగం చేసాడు అశ్విన్ రామ్. ఫస్టాఫ్ వరకు కాస్తో కూస్తో ట్రాక్‌లోనే ఉంది డార్లింగ్.. అక్కడక్కడా నవ్వులు కూడా బాగానే పండాయి. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పింది.. మరీ ముఖ్యంగా నభా నటేష్ కారెక్టరైజేషన్ కన్ఫ్యూజన్‌కు పరాకాష్ట. కొంతవరకు బాగానే అనిపించినా.. మల్టిపుల్ డిజార్డర్ అనేసరికి క్లారిటీ మిస్ అయింది. అన్ని కారెక్టర్స్ ఆమెలోకి ఎందుకొచ్చాయి.. హీరో చిన్న మాట చెప్పగానే ఎందుకు వెళ్లిపోతాయి..? ఆ సమస్య వెనక ఉన్న బలమైన కారణాలు కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రియదర్శి పెళ్లి చెడిపోయే సీన్.. ఆ తర్వాత నభా పరిచయం అయిన తర్వాత వచ్చే సీక్వెన్స్ బాగానే అనిపిస్తాయి. కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మెయిన్ ప్రాబ్లమ్ అంతా సెకండాఫ్ మొదలైన తర్వాతే మొదలైంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆసక్తికరంగానే ఉన్నా.. ఆ తర్వాత స్క్రిప్ట్ ముందుకెళ్లిన తీరు బోరింగ్‌గా అనిపిస్తుంది.

నటీనటులు:

ప్రియదర్శి తన వరకు చాలా ప్రయత్నించాడు సినిమాను కాపాడటానికి.. మనోడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. నభా నటేష్ గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు.. బాగా చేసిందో.. యాక్టింగ్ డోస్ ఎక్కువైందో అర్థం కాలేదు. నందిని పాత్రలో ఆనన్య నాగళ్ల పర్లేదు. బలగం ఫేమ్ మురళీధర్‌ గౌడ్‌ పాత్ర మరోసారి ఆకట్టుకుంది. ఆయన డైలాగ్స్ బాగున్నాయి. సీనియర్ నటుడు రఘుబాబు చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో కనిపించాడు. బ్రహ్మానందంను కావాలని పెట్టినట్లు అర్థమవుతుంది. హీరో స్నేహితులుగా కృష్ణ తేజ, విష్ణు ఓకే.. రాజేశ్వరి ముల్లపూడి, స్వప్నిక, సంజయ్‌ స్వరూప్‌ పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదనిపించాయి. చివర్లో నిహారిక కొణిదెల కాసేపు అలా మెరిసారు.

టెక్నికల్ టీం:

వివేక్ సాగర్ సంగీతం ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు.. ఒకట్రెండు పాటలు మాత్రమే ఓకే అనిపించాయి. కెమెరా వర్క్ బాగుంది.. ఈ విషయంలో నరేష్‌ రామదురై తన పనితనం చూపించారు. ఎడిటర్ ప్రదీప్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇలాంటి సినిమాను 2 గంటల 42 నిమిషాలు కట్ చేయడమే పెద్ద నేరం. అయితే దర్శకుడు అశ్విన్ రామ్ ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. ఇక దర్శకుడు అశ్విన్‌ రామ్ రాసుకున్న కథ బాగానే ఉన్నా.. దాన్ని స్క్రీన్ మీద చూపించిన తీరు అస్సలు ఆకట్టుకోలేదు. హనుమాన్ నిర్మాతలు సినిమాని రాజీపడకుండా నిర్మించారు. కానీ ఏం లాభం కథనం బాగోలేక ఎటూ కాకుండా పోయాయి.. అశ్విన్ రామ్ స్క్రీన్ ప్లే టూ మచ్ కన్ఫ్యూజన్‌గా ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా డార్లింగ్.. ఇట్స్ బోరింగ్..!